Praveen Kumar : అల్లు అర్జున్ కు ఒక న్యాయం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరో న్యాయమా అని బిఆర్ఎస్ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా , హుస్సేన్ సాగర్ ఘటనకు మరోలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తున్నది అని అడిగారు. బీసీ బిడ్డలు గణపతి,అజయ్ ల ప్రాణాలు… రేవతి ప్రాణాల విలువ ఒకటి కాదా అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. రేవంత్ రెడ్డి గారు మీకు, బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య అనుబంధం ఏంటి అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ కేసులో మహిళ చనిపోతే అల్లు అర్జున్ ని (A-11) గా జైలుకు పంపారు కదా.. మరి భారతమాత మహా హారతి ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. భారతమాత మహా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి గారు దీనికి బాధ్యులు కారా.. హుస్సేన్ సాగర్ లోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాంబులు పేల్చడానికి అనుమతి ఇచ్చింది ఎవరు.. ఆ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని నిలదీశారు.దీనికి టూరిజం అధికారుల అనుమతి ఉందా.. అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకున్నారా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ ఘోర ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు మీరే కదా హోంమంత్రి. అగ్నిమాపక శాఖ కూడా మీ దగ్గరే ఉంది కదా అని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.