హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు నగరం మొత్తం మేఘాలతో కప్పబడి ఉంది. ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ రోజు ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో గంటలో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది.