హైదరాబాద్ నగర వాసులకు వరుణుడు చుక్కలు చూపిస్తున్నాడు. నగరంలో కురుస్తున్న కుండపోత వానకు రోడ్లు పూర్తిగా జలదిగ్బందమయ్యాయి. గచ్చిబౌలి నుంచి ..కోటి వరకు.. ఇటు మెహదీపట్నం నుంచి ..కూకట్ పల్లి వరకూ పూర్తిగా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువుల్లా మారాయి. ఇక టోలిచౌకి, మణికొండ, నానాక్ రామ్ గూడ ప్రాంతాల్లో పూర్తిగా కాలనీల్లో నీరు చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. పనులు, ఆఫీసులకు వచ్చిన రహదారులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయారు. మరీ ముఖ్యంగా మాసబ్ ట్యాంక్ నుండి పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. ఓవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు వర్షంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కాబట్టి వర్షసూచన, ట్రాఫిక్ జామ్ ను దృష్టిలో ఉంచుకొని నగరవాసులు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.