– 10 రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వానలు పడే అవకాశం
– ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగొచ్చు
– హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మార్చి నెలతో పాటు ఏప్రిల్ మొదటి వారం రాష్ట్రంలో ఎండలు దంచికొట్టడంతో జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఏప్రిల్ ప్రారంభంలోనే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండల వేడికి అల్లాడిపోయారు. అయితే, గత వారం రాష్ట్రంలోని కొన్నిజిల్లాల్లో వానలు పడటంతో వెదర్ కాస్త చల్లబడి భానుడి భగభగల నుంచి జనాలకు ఉపశమనం లభించింది. మళ్లీ రెండ్రోజులుగా ఎండలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు తెలిపింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తర్వాత ఎండ తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.
కాగా, వర్షాల కారణంగా గత వారం ఉష్ణోగ్రతలు కాస్త పడిపోయాయి. వచ్చే పది రోజులపాటు అంటే.. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదు రోజుల పాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.