ఏడాదికి పైగా టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఆఫ్ఘనిస్థాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను పక్కన పెట్టి వీరిద్దరిని సెలెక్ట్ చేయడం ఎదురుదెబ్బ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తరహా అభిప్రాయాలకు విరుద్ధంగా టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని సురేష్ రైనా వ్యాఖ్యానించాడు. వారిద్దరూ ఉంటే టీమ్ పటిష్ఠంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న అమెరికా, వెస్టిండీస్‌లలోని పిచ్‌లు కాస్త సంక్లిష్టంగా ఉంటాయని, రోహిత్, కోహ్లీల అనుభవం అక్కడి పనిచేస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగులు పూర్తి చేసుకోబోతున్నాడని అనుభవాన్ని ప్రస్తావించాడు. వారిద్దరి అనుభవం జట్టు బ్యాటింగ్‌కు అదనపు బలాన్ని ఇస్తుందని, టీ20 వరల్డ్ గెలిచే అవకాశాలను మెరుగుపరుస్తుందన్నాడు. ఈ మేరకు జియో సినిమా, స్పోర్ట్స్18తో మాట్లాడుతూ రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు