– ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
– జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలల్లో సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30- 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.