– ట్విట్టర్లో పోస్ట్ చేసిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా
– సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో : బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పాశెట్టి–రాజ్ కుంద్రాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీళ్లిద్దరూ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుంద్రా తాజాగా పెట్టిన పోస్టు ఇందుకు కారణం. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్లో రాజ్ కుంద్రా ఓ పోస్ట్ పెట్టారు. అయితే, అందులో శిల్పాశెట్టి పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం పలు సందేహాలకు దారి తీస్తోంది. ‘మేము విడిపోతున్నాం. దయచేసి ఈ కష్ట కాలంలో మాకు సపోర్ట్‌గా నిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా’అని పోస్ట్ చేశారు. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు. అయితే, ఈ పోస్ట్ విడాకులకు సంబంధించిందేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం విడాకుల గురించి కాదంటున్నారు. కొన్ని నెలల నుంచి రాజ్ కుంద్రా మాస్క్ ధరించి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు తనతో ఉంటోన్న మాస్క్ గురించి ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే, శిల్పాశెట్టి సోషల్‌మీడియాలో మాత్రం విడాకులకు సంబంధించి ఎలాంటి పోస్టులు లేవు. అంతే కాదు ఆమె తాజాగా కూడా రాజ్‌కుంద్రా కొత్త సినిమా ‘యూటీ 69’కు విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. దీంతో ఆయన పోస్ట్ మాస్క్ గురించేనని తెలుస్తోంది.