న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. విపక్షాల తీవ్ర ఆందోళనలు, వ్యతిరేకత మధ్య బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే మద్దతివ్వగా.. కాంగ్రెస్, తృణమూల్, టీఆర్‌ఎస్, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్, ఎస్పీ, ఆప్, బీఎస్పీలు వ్యతిరేకించాయి. బిల్లుల ఆమోదం తర్వాత రాజ్యసభను డిప్యూటీ ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు. ఇదివరకే ఈ బిల్లులను లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
బిల్లు ప్రతుల్ని చింపిన విపక్ష సభ్యులు
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేపెట్టగానే గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లు ప్రతుల్ని విపక్ష సభ్యులు చింపేశారు. ఈ బిల్లుతో రైతులకు తీరని నష్టమంటూ నినాదాలతో హోరెత్తించారు. బిల్లును ఉపసంహరించాలని విపక్షాల డిమాండ్ చేయడంతో పాటు.. డిప్యూటీ చైర్మన్ మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు.
కేంద్రం హామీ ఇస్తుందా?
ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే ఎన్డీయే బిల్లుగా తీసుకొచ్చిందని.. కాంగ్రెస్ ఆత్మవంచన మానుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో 20 శాతం జీడీపీ రైతుల ద్వారా సమకూరుతోందని.. బిల్లుల ద్వారా రైతులను బానిసలుగా మార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని డీఎంకే ఎంపీ ఇళంగోవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లుల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందా? అని ప్రశ్నించారు.
రాజ్యసభలో పాసైన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులు
RELATED ARTICLES