– దాని గురించి మాట్లాడటానికి బాధపడుతున్నా
– నాకు సపోర్టుగా నిలిచిన వారికి ధన్యవాదాలు
– నటి రష్మిక మందన్నా ట్వీట్
ఇదే నిజం, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన తన మార్ఫింగ్ వీడియోను ఉద్దేశించి నటి రష్మిక మందన్నా స్పందించారు. ఈ ఘటన తననెంతో భయపెట్టిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ‘ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న నా మార్ఫింగ్ వీడియో గురించి మాట్లాడటానికి ఎంతో బాధపడుతున్నా. టెక్నాలజీ ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఈ ఘటన నాతోపాటు నాలాంటి ఎంతోమందిని భయానికి గురిచేస్తోంది. ఇదే ఘటన నేను కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిసేది కాదు. ఒక మహిళగా అందులోనూ నటిగా నన్నెంతగానో సపోర్ట్ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అలాగే, మన గుర్తింపునకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది’అని ఆమె అన్నారు. రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఆదివారం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా స్టార్ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్ చేసి.. అందులో రష్మిక ముఖం పెట్టారు. చూడటానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్న ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి సెలబ్రిటీ పరువుకు భంగం కలిగించడం నేరమన్నారు.
బిగ్ బీ అమితాబ్ ఆగ్రహం
ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటివి అత్యంత ప్రమాదకరం
రష్మిక మార్ఫింగ్ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఇంటర్నెట్‌ను వాడే డిజిటల్ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ రూల్స్ ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. తమ అకౌంట్లలో ఏ యూజర్ కూడా నకిలీ/తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ అలాంటి ఫేక్ సమాచారాన్ని గుర్తిస్తే.. దాన్ని 36 గంటల్లోగా తొలగించాలి. ఈ రూల్స్ పాటించకపోతే రూల్ 7 కింద.. ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చు. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలి’అని రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.