ఎండనక, వాననక.. నిత్యం కూరగాయలు అమ్ముకుంటూ.. వైద్యం కోసం రూపాయికి రూపాయి పోగు చేసుకున్నాడు.
అలా పోగు చేసుకున్న రూ. 2 లక్షలను ఎలుకలు పటపట కొరికేశాయి.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తండాలో చోటు చేసుకుంది.
భూక్య రెడ్యా అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అనారోగ్యానికి గురైన రెడ్యా.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షలను దాచి పెట్టాడు. ఆ నగదును ఇంట్లోని బీరువాలో దాచాడు.
అయితే ఎలుకలు బీరువాలోకి దూరి ఆ నోట్ల కట్టలను పటపట కొరికేశాయి. ఒక్క నోటును కూడా వదలకుండా తినేశాయి.
అన్ని రూ. 500 నోట్లే. ఆ నోట్లను చూసి రెడ్యా బోరున విలపించాడు.
ఎలుకలు కొరికిన నగదును తీసుకుని మహబూబాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంక్‌కు రెడ్యా వెళ్లాడు.
ఆ నోట్లు చెల్లుబాటు కావని చెప్పడంతో చేసేదేమీ బాధిత వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.
ఎవరైనా తన వైద్యం కోసం సాయం చేయాలని రెడ్యా వేడుకుంటున్నాడు.