RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో 17 ఏళ్ల కలను సాకారం చేస్తూ తొలిసారి ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. ఈ విజయోత్సాహంలో ఉన్న సమయంలోనే ఆర్సీబీ యాజమాన్యం ఫ్రాంచైజీని పూర్తిగా లేదా కొంత షేర్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ ఆర్థిక సంస్థ బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం, ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు రెండు బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16,000 కోట్లు) ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీని బ్రిటిష్ డిస్టిలరీ దిగ్గజం ‘యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్’ మాతృ సంస్థ అయిన డియాజీవో పీఎల్సీ నిర్వహిస్తున్నది.
అయితే, ఈ విక్రయం గురించి ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్యం లేదా డియాజీవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేకపోవడంతో, ఐపీఎల్ అభిమానులు, ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్సీబీ ఐపీఎల్‌లో అత్యంత జనాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటి కాగా, ఈ వార్తలు ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఈ డీల్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.