Homeసైన్స్​ & టెక్నాలజీInternet Problems : ఇంటర్‌నెట్ ఎందుకు తరచూ మొరాయిస్తోంది, ఇలా జరక్కుండా ఏం చేయాలి..

Internet Problems : ఇంటర్‌నెట్ ఎందుకు తరచూ మొరాయిస్తోంది, ఇలా జరక్కుండా ఏం చేయాలి..

Reasons for continuous Internet Problems : ఇంటర్‌నెట్ ఎందుకు తరచూ మొరాయిస్తోంది, ఇలా జరక్కుండా ఏం చేయాలి..

ఫేస్‌బుక్ అధినేత మార్క్‌ జుకర్ బర్గ్ తన పోస్ట్‌లపై వచ్చే కామెంట్లను చదువుతారా అన్నది సందేహమే.

ఎందుకంటే ఫేస్‌బుక్ అవుటేజ్ సందర్భంగా ఆయన పెట్టిన క్షమాపణ పోస్టుపై కుప్పలు తెప్పలుగా రియాక్షన్లు వస్తున్నాయి.

ఆయన వాటన్నింటినీ చదవాలంటే రేయింబవళ్లు కూర్చున్నా, పూర్తి చేయడానికి 145 రోజులు పడుతుంది.

ఇటీవల ఫేస్‌బుక్, వాట్సాప్ సర్వీసులు సుమారు 6 గంటలపాటు ఆగిపోయాయి.

జనరల్‌ మెయింటెనెన్స్‌ సందర్భంగా ఈ అంతరాయం కలిగినట్లు ఫేస్‌బుక్ పేర్కొంది.

”ఈరోజు మా సర్వీసులలో ఏర్పడిన అంతరాయానికి క్షమించండి” అని జుకర్‌బర్గ్ పోస్ట్‌పెట్టారు. ఈ పోస్టుకు 827,000 మంది స్పందించారు.

ఇందులో కొన్ని కామెంట్లు సెటైరిక్‌గా, కొన్ని సరదాగా ఉన్నాయి. ” పరిస్థితి భయంకరంగా ఉంది. నేను నా కుటుంబంతో మాట్లాడాల్సి వచ్చింది” అని ఒక ఇటాలియన్ కామెంట్ చేయగా, ”నా ఫోన్ పాడై పోయిందనుకుని రిపేర్ షాప్‌కు వెళ్లాను” అని నమీబియా వాసి రాశారు.

”మీరు అన్నింటిని ఒకేసారి మూసేయడం సరి కాదు. దాని ఎఫెక్ట్ విస్తృతంగా ఉంటుంది” అని ఓ నైజీరియన్ అభిప్రాయపడగా, ”మా వ్యాపారానికి నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించండి” అని ఇండియాకు చెందిన ఓ యూజర్ అన్నారు.

దీన్నిబట్టి ఒక విషయం అర్ధమవుతోంది. ఈ సర్వీసులపై కొన్ని కోట్లమంది ఆధారపడ్డారు.

అంటే కేవలం వినోదం కోసమే కాదు, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కూడా ఈ సేవలను వినియోగించుకుంటున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా ప్రస్తావించాలి. ఇలాంటి అంతరాయాలు ఎప్పుడో ఒకసారి కాదు.

ఇటీవల తరచూ ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

“గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీలు పెద్ద మొత్తంలో కంటెంట్‌ను చిన్న చిన్న నెట్‌వర్క్‌లపై ఆధారపడి నడిపిస్తున్నాయి” అని డౌన్ డిటెక్టర్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ల్యూక్ డెరిక్స్ చెప్పారు.

”వాటిలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా, అది వందలు, వేల సంఖ్యలో ఇతర సర్వీసులను ప్రభావితం చేస్తుంది” అన్నారు డెరిక్స్.

ఉదాహరణకు స్మార్ట్ టెలివిజన్‌ల వంటి విభిన్న సేవలు, డివైస్‌లను సైన్ ఇన్ చేయడానికి ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు.

ఫేస్‌బుక్ ఆగిపోవడంతో వీటికి కూడా అంతరాయం ఏర్పడింది.

”ఇంటర్నెట్ ఇప్పుడు అంతరాయాల యుగంలో ఉంది. డౌన్ కాగానే అందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఇప్పుడేం చేద్దాం అనుకుంటాం” అన్నారు డెరిక్స్

వెబ్ సర్వీసులు, వెబ్‌సైట్లు అంతరాయలను డెరిక్స్, అతని బృందం పరిశీలిస్తుంటుంది.

కీలకమైన సేవలకు ఇబ్బంది కలిగగించే అంతరాయాలు తరచూ ఏర్పడుతున్నాయి. అవి రానురాను పెరుగుతున్నాయి” అన్నారు డెరిక్స్

”ఫేస్‌బుక్‌లో ఏదైనా సమస్య వస్తే, అది కేవలం ఇంటర్నెట్‌ను మాత్రమే కాక, ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపిస్తుంది.

కాలిఫోర్నియాలో ఒక చిన్న టీమ్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వేచి చూస్తుంటారు” అని డెరిక్స్ వివరించారు.

ఇలాంటి పరిణామాలు తరచూ జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

అతి పెద్ద బ్రేక్‌డౌన్‌లు

అక్టోబర్ 2021: ఒక ‘కాన్ఫిగరేషన్ ఎర్రర్’ కారణంగా ఫేస్‌‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు దాదాపు 6 గంటలపాటు ఆగిపోయాయి.

వీటిని వాడుకోలేని వారు ట్విటర్ వంటి సైట్లకు మళ్లడంతో వాటికి కూడా అంతరాయం ఏర్పడింది.

జూలై 2021: కంటెంట్ డెలివరీ కంపెనీ అకమాయిలో డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్)లో బగ్ కారణంగా, ఎయిర్‌బీఎన్‌బీ, ఎక్స్‌పీడియా, హోమ్ డిపో, సేల్స్‌ఫోర్స్‌లాంటి సైట్‌లు గంటపాటు డౌన్ అయ్యాయి.

అంతకు నెల రోజుల ముందు కూడా కంపెనీలో ఇలాంటి అంతరాయం ఏర్పడింది.

జూన్ 2021: తమ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఒక బగ్ కారణంగా అమెజాన్ , రెడిట్, ట్విచ్, గిట్‌హబ్‌, షాపిఫై, స్పాటిఫైతో పాటు పలు న్యూస్ సైట్లు గంటపాటు నిలిచిపోయాయి.

డిసెంబర్ 2020: ఇంటర్నల్ స్టోరేజ్ కోటా సమస్య ఎదుర్కొంటున్నామని గూగుల్ కంపెనీ ప్రకటించిన 90 నిమిషాలలోనే ఆ సంస్థకు చెందిన జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్‌తోపాటు వివిధ గూగుల్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి.

మార్చి 2019: కాన్ఫిగరేషన్ మార్పుల కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు 14 గంటల పాటు ఆగిపోవడమో, అంతరాయం కలగడమో జరిగింది. లాగిన్ కోసం ఫేస్‌బుక్‌ను ఉపయోగించే టిండర్, స్పాటిఫైతో సహా మరికొన్ని సైట్‌లు కూడా ప్రభావితమయ్యాయి.

ఇలాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు సైబర్ దాడి జరిగిందని యూజర్లు చాలామంది ఆందోళన చెందుతున్నారు.

అయితే, ఇలాంటివి తరచూ మానవ తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయని, కొన్నిసార్లు పాతబడిపోయిన డివైస్‌లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.

“ఇది ఉపయోగించే ప్రోటోకాల్‌లు ప్రాథమిక దశలో డంబ్ టెర్మినల్స్ నుండి మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్‌లకు కనెక్ట్ చేసిన కాలంలో రూపొందించినవి.

కాబట్టి, వీటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చిన్న సమస్య వచ్చినా అది మొత్తాన్ని క్రాష్ చేస్తుంది” అని ఇంటర్‌నెట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ బిల్ బుచానన్ అన్నారు.

అయితే, ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని, అయితే వాటిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని బుచానన్ అన్నారు.

”వ్యవస్థ పని చేస్తుంటుంది. కానీ ఈ మార్పులు చేర్పులు చేయడానికి వీటిని ఒక రోజంతా స్విచ్ఛాఫ్ చేసి ఉంచలేం” అన్నారాయన.

ప్రత్యామ్నాయం లేదా?

ఇంటర్నెట్‌ను, దాని వ్యవస్థలను పునర్నిర్మించడం లేదా మార్చడానికి బదులు డేటా షేరింగ్‌, స్టోరింగ్ విధానాలను మార్చుకోవడం మంచిదని ప్రొఫెసర్ బుచానన్ సూచించారు.

లేదంటే భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు మరిన్ని ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

రానురాను ఇంటర్నెట్ సెంట్రలైజ్ అవుతోందని, ఒకేచోట నుంచి ఎక్కువ డేటా వస్తోందని, పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని బుచానన్ సూచించారు.

అనేక ప్రాంతాల నుంచి డేటా వచ్చేలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కడైనా సమస్య వస్తే అది కొన్ని సర్వీసులనే ప్రభావితం చేస్తుంది తప్ప మొత్తం ఇంటర్నెట్‌ను ఆపే పరిస్థితి ఉండదన్నారు.

ఇంటర్నెట్ అంతరాయాల కారణంగా యూజర్లు ఇబ్బంది పడుతుంటారని, అయితే ఇలాంటి అవుటేజ్‌లు ఇంటర్నెట్ మరింత మెరుగు పరచడంలో సహాయ పడుతుంటాయని బుచానన్ అన్నారు.

దీనికి ఇటీవల జరిగిన అవుటేజ్‌ ఒక ఉదాహరణగా చూపారు బుచానన్.

ఫోర్ట్స్ అంచనా ప్రకారం ఫేస్‌బుక్ ఆరు గంటలపాటు నిలిచి పోవడం వల్ల , ఆ సంస్థకు సుమారు 66 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 500కోట్లు) నష్టం వాటిల్లింది.

ఇలాంటి నష్టాలు మళ్లీ జరక్కుండా సీనియర్ అధికారులు జాగ్రత్త పడతారని బుచానన్ అన్నారు.

”ఈ సంఘటన ద్వారా ఫేస్‌బుక్ బాగా నష్టపోయింది” అని డెరిక్స్ అన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల ఆపరేటర్లు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తారని డెరిక్స్ వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img