పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తమ సత్తా చాటారు. శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసాడు. సునీల్ నరైన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులతో చెలరేగారు. వెంకటేష్ అయ్యర్ 39, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులతో మెరిశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి విజయం సాధించింది. జానీ బెయిర్‌స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 108 పరుగులు చేసి సెంచరీతో అజేయ నిలిచాడు.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు, శశాంక్ సింగ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 68 పరుగులతో సత్తా చాటారు. అయితే కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే వికెట్ తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది.