Homeజాతీయం#Rent #House #Tenancy : అద్దె ఇండ్ల స‌మ‌స్య‌ల‌కు చ‌ట్టంతో చెక్‌

#Rent #House #Tenancy : అద్దె ఇండ్ల స‌మ‌స్య‌ల‌కు చ‌ట్టంతో చెక్‌

ఇండ్లు, స్థలాల గొడవలను పరిష్కరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి (మోడల్‌ టెనెన్సీ యాక్ట్‌-ఎంటీఏ) ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

అద్దె ఇండ్లు, స్థలాలకు సంబంధించిన నిబంధనల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దడానికి ఈ చట్టం సాయపడుతుందని కేంద్రప్రభుత్వం పేర్కొంది.

అద్దె ఇండ్ల గొడవలకు సంబంధించి ఇంటి యజమాని, అద్దెకుండేవారి (టెనెంట్‌) ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక జిల్లా రెంట్‌ అథారిటీ, కోర్టులు, ట్రిబ్యునళ్లను నియమిస్తున్నట్టు వెల్లడించింది.

దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను సంప్రదించి జిల్లా కోర్టు న్యాయమూర్తి లేదా జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తిని జిల్లా రెంట్‌ ట్రిబ్యునల్‌కు చీఫ్‌గా నియమించుకోవాలని సూచించింది.

అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇండ్లను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించింది.

తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, యూటీలకు దీన్ని పంపనున్నట్టు తెలిపింది.

అద్దె నమూనా చట్టం (ఎంటీఏ) సమగ్ర స్వరూపం

అధికారిక అద్దె ఒప్పందం, అద్దెకుండే వారితో యజమాని ప్రవర్తించాల్సిన తీరు, ఇంటి వివాదాలు వంటి అంశాలను పరిష్కరించే ఉద్దేశంతో ‘నమూనా అద్దె చట్టం’ను కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం..

  • అద్దెకు దిగేవారు గరిష్టంగా రెండు నెలల అద్దెను సెక్యూరిటీ నిమిత్తం అడ్వాన్సుగా చెల్లించాలి. వాణిజ్య స్థలాలు, భవనాలైతే ఈ డిపాజిట్‌ మొత్తం ఆరు నెలల అద్దెగా నిర్ణయించారు.
  • ఇంటి అద్దెను సదరు ఇంటి యజమాని పెంచాలనుకుంటే అద్దెకుండేవారికి (టెనెంట్‌) మూడు నెలల ముందే దాని గురించి నోటీసు ఇవ్వాలి.
  • దీనిపై ఇరువురూ చర్చించుకొని సామరస్యంగా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. భవనాలు, వ్యాపార ప్రాంగణాలు, స్థలాలకు ఇది వర్తిస్తుంది.
  • అద్దెకు ఉండేవారితో గొడవ వస్తే యజమాని ఏకపక్షంగా నీరు లేదా విద్యుత్‌ సరఫరాను నిలిపివేయకూడదు.
  • అలా చేస్తే బాధ్యులైన ఇంటి యజమానికి జరిమానా విధించి నష్టపరిహారాన్ని టెనెంట్‌కు ఇప్పించే అధికారం జిల్లా రెంట్‌ అథారిటీకి ఉన్నది.
  • తప్పుడు ఫిర్యాదులు చేస్తే.. బాధ్యులకు భారీ జరిమానాలు తప్పవు.
  • ఇండ్లలో ఏవైనా మరమ్మతులు చేయాల్సివస్తే (గోడలకు రంగులు, ఎలక్ట్రికల్‌ తీగల్లో మార్పులు, కిచెన్‌లో మరమ్మత్తులు వంటివి) ఆ ఖర్చును యజమాని భరించాలి.
  • మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించకూడదు.
  • అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించి గడువు మీరిన తర్వాత కూడా ఇండ్లల్లో నివాసముంటే భారీ జరిమానా విధిస్తారు.
  • ఈ జరిమానా ఇంటి నెల అద్దెకు రెట్టింపు లేదా రెండు రెట్లు లేదా నాలుగురెట్ల వరకు ఉండొచ్చు.
  • కొత్తగా అద్దెకు దిగేవారు వాటికి సంబంధించిన ఒప్పందం ప్రతులను జిల్లా రెంట్‌ అథారిటీకి అందజేయాలి.
  • దీంతో అద్దె సవరణకు సంబంధించిన నిర్ణయాలు, వివాదాలు తలెత్తినప్పుడు సమస్యను త్వరగా పరిష్కరించే వీలవుతుంది.
  • ఇప్పటికే అద్దెకు దిగినవారికి కాకుండా, ఇకపై ఇండ్లల్లో అద్దెకు దిగేవారికి ఎంటీఏ నిబంధనలు వర్తిస్తాయి.

Recent

- Advertisment -spot_img