Homeహైదరాబాద్latest Newsరిటైర్మెంట్లు షురూ

రిటైర్మెంట్లు షురూ

తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. గత ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏ శాఖలోనూ ఉద్యోగుల రిటైర్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ వయోపరిమితి గడువు ముగియటంతో పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 60 మంది, ఆర్టీసీలో 176 మంది, పోలీసుశాఖలో 100 మంది వరకు ఉద్యోగ విరమణ పొందారు. ఈరోజు (మార్చి 31) ఆదివారం కావడంతో మార్చి 30న శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. శనివారం పలు కార్యాలయాల్లో రిటైరైన వారు చేసిన సేవలకు సంబంధిత విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపి వీడ్కొలు పలికారు.

రిటైరైన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ, జీపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రతినెలా ఇచ్చే పింఛను ఖరారు చేసి, మరుసటి నెల నుంచే మంజూరు చేయాల్సి ఉంది. ఈ ప్రోత్సాహకాల కోసం పదవీ విరమణకు నెలరోజుల ముందు నుంచి ఉద్యోగులు దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తుంటారు. వీటిని ఏజీ కార్యాలయం ఆమోదించిన తరువాత విరమణ ప్రోత్సాహకాలు రిటైర్డ్ ఉద్యోగులకు అందుతాయి.

పింఛను మినహా ఇతర ప్రోత్సాహకాలు ఆలస్యమవుతున్నాయని కొందరు ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ చనిపోయిన వారి ప్రోత్సాహకాలు సైతం ఆర్నెల్లుగా అందలేదని వాపోయారు. ఎవరైనా ఉద్యోగి రిటైరైన రోజునే ప్రోత్సాహకాలన్నీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img