ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ బృందం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపాలని, లేకపోతే 50వేల మంది రైతులతో తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. పంప్‌హౌస్‌లు ఆన్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజినీర్లు కూడా చెప్పారని, ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాల్లోపు గడువు విధిస్తున్నామన్నారు. తాము కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ అనేక అసత్య ప్రచారాలు చేసిందని, కానీ అవన్నీ గోదావరి వరదలో కొట్టుకుపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటల సాగు కోసం నీళ్లు లేని పరిస్థితి నెలకొన్నదన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో కరువనే మాట వినపడకూడదనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న సంఘటన పట్టుకుని మేడిగడ్డలో జరిగిన దానిని భూతద్దంలో చూపించి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి, రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూశారని మండిపడ్డారు. దీంతో దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలు ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో శనివారం అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్లను ఆన్ చేసినట్లు అధికారులు తెలిపారు. గాయత్రి పంప్ హౌస్‌కు 6,240 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరుకు జలాలు తరలిస్తున్నారు.