Revanth reddy: “బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు తొమ్మిదేళ్లు అద్భుతంగా పాలిచాం. చెప్పిన వాటికంటే ఎక్కువ చేశామని వ్యాఖ్యానిస్తుంటారు. అదే నిజమైతే ఇప్పుడు 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. కేసీఆర్‌కి చీము నెత్తురు ఉంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి. లేకుంటే కేసీఆర్ మాడ అని ఒప్పుకోవాలి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు కౌంటరిచ్చారు. రేవంత్ రెడ్డి శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని రేవంత్ చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్‌లో ఇప్పుడున్న సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు..? అని రేవంత్ ప్రశ్నించారు.
ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వాదనలో పస లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ విద్యుత్ చార్జీలను పెంచింది. దీని మీద కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడారు. ఆ ఉద్యమంలో 25 వేల మంది రైతుల మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ ఉద్యమం సందర్భంగానే చేపట్టిన ఛలో అసెంబ్లీ ఆందోళన సందర్భంగా జరిగిన బషీర్ బాగ్ కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారు. చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
చంద్రబాబు హయాంలో కేసీఆర్ టీడీపీ హెచ్ఆర్డీ విభాగం ఛైర్మన్ గా ఉన్నారు. హెచ్ఆర్డీ పార్టీ పాలసీలను తయారు చేసే విభాగం. ఆ విభాగం రూపొందించే పాలసీలనే తర్వాత ప్రభుత్వంలో అమలు చేస్తారు. అప్పుడు పోచారం మంత్రిగా ఉన్నారు.. గుత్తా కీలక పదవిలో ఉన్నారు..వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్ పాలసీని తయారు చేశారు. అప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్న మీరు బషీర్ బాగ్ కాల్పులకు మీరు కారణం కాదా అని కాంగ్రెస్ తరపున ప్రశ్నిస్తున్నా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.28 ఆగస్టు, 2000 లో బషీర్ బాగ్ కాల్పులు జరిగాయి. ఆ సమయంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్. 2001, ఏప్రిల్ 21న కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేశారు.