బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్లతో అప్పుల రాష్ట్రాన్ని తమకు అప్పగించారని సీఎం రేవంత్ మండిపడ్డారు. భట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కనుకే రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలకు నిధులు సర్దుతున్నారన్నారు. తమ హయాంలో అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో 109 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కేవలం 39 సీట్లకు మాత్రమే పరిమితమైందని, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి మతతత్వ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తుందన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో చర్చించానని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.