Homeహైదరాబాద్latest Newsరైతుకు దూరమైన రేవంత్

రైతుకు దూరమైన రేవంత్

– కాంగ్రెస్​ మీద కస్సుమంటున్న పల్లె
– దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీకి స్టార్​ క్యాంపెయినర్​
– రాష్ట్రంలో అన్నదాతతో బంధం కట్​
– నాలుగు నెలలకే విశ్వసనీయత కోల్పోయిన సీఎం
– రైతన్నకు ఇచ్చిన హామీల అమలులో తడబాటు
– రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్​పై రోజుకో మాట
– కరెంటు కోతలు, నీటి నిర్వహణ మీదా అనేక విమర్శలు
– డిసెంబర్​ 9నే రుణమాఫీ మీద సంతకం పెడతానన్న రేవంత్​
– కొత్త రుణాలు తెచ్చుకోవాలంటూ రైతులకు పిలుపు
– పవర్​లోకి వచ్చాక అటకెక్కిన హామీ
– ఆగస్ట్​ 15వరకు రుణమాఫీ చేస్తామంటూ కొత్త రాగం
– రైతుల్లో రోజురోజుకు క్షీణిస్తున్న విశ్వసనీయత

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: అన్నదాతలు రేవంత్​ ను ఎంతగా నమ్మారో ఇప్పుడు అంతకు రెట్టింపు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన చేసిన బాసలు.. ఇచ్చిన హామీలు వారి చెవుల్లో మారుమోగిపోతున్నాయి. కేసీఆర్​ రైతులకు సాయం చేసినా.. అంతకు మించి సాయం చేస్తామనడంతో రైతులు రేవంత్​కు, కాంగ్రెస్​ పార్టీకి అండగా నిలబడ్డారు. కానీ కాంగ్రెస్ పవర్​ లోకి వచ్చిన కొన్ని రోజులకే వారి ఆశలు అడియాసలయ్యాయి.. రైతు బంధు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తే సుదీర్ఘ నీరీక్షణ తర్వాత కొంతమంది రైతులకు ఆ సొమ్ము అకౌంట్లో జమ అయ్యింది. ఐదెకరాల లోపు వారందరికీ జమ చేశామని సర్కారు చెబుతున్నా.. మాకింకా రాలేదన్న ఐదెకరాల లోపు రైతులూ ఉన్నారు.. 15వేలు కాదు 10 వేల కోసం ఎదురుచూస్తున్నారు అన్నదాతలు.. ఆ సాయం వచ్చినా చాలనుకుంటున్నారు. ఇక రుణమాఫీ ఊసు లేదు.. కౌలు రైతులకు సాయం జాడలేదు.. రైతు కూలీల మాటెత్తిన వారే లేరు.. వెరసి రైతులోకం ఆవేదనలో ఆగ్రహంలో ఉంది. మాకు రైతు భరోసా కింద 15వేలు అక్కర్లేదు.. కనీసం పదివేలైనా వస్తుందా? చెరువులు ఎండకుండా నిండుగా ఉంటాయా? కరెంటు కోతల్లేకుండా వస్తుందా? మళ్లీ మా పొలాలు మునిపటి లాగే కళకళలాడుతాయా.. అన్న ప్రశ్నలు వాళ్లను తొలుస్తున్నాయి. వెరసి రేవంత్ రెడ్డి​ తన విశ్వసనీయతను కోల్పోతున్నారు. ఏ అన్నదాత అయితే రేవంత్​ కు అండగా నిలబడ్డాడో.. అతడితో రేవంత్​ కు బంధం తెగిపోతున్నది. మరి ఈ ఎఫెక్ట్​ పార్లమెంటు ఎన్నికల మీద పడుతుందా? .. ఒకవేళ అన్నదాత ఆగ్రహిస్తే వారి ఓట్లు ఎవరికి మల్లుతాయో వేచి చూడాలి.

బంధానికి బ్రేకులు
ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి క్రమంగా రైతులకు దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలకు తాజా పరిస్థితికి పొంతన లేకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్​ ఏ సభకు వెళ్లినా డిసెంబర్​ 9 తారీఖునే రుణమాఫీ చేస్తా.. రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇస్తా.. పట్టా రైతులతో పాటు .. కౌలు రైతులకు సాయం చేస్తా.. అంటూ రేవంత్​ హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీలు నీటిమూటలయ్యాయి. వరిపంటకు రూ. 500 బోనస్​ ఇస్తామని కూడా రేవంత్ హామీ ఇచ్చారు. వెరసి రైతాంగానికి రేవంత్​ రెడ్డికి మధ్య దూరం పెరుగుతోంది.

రచ్చబండ మీద రైతు బంధు రచ్చ
ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా రచ్చబండ మీద రైతు బంధు పథకం మీదే చర్చ జరుగుతోంది. రైతు బంధు పాత పద్ధతిలో కనీసం 10వేలు కూడా ఇవ్వడం లేదన్న ఆగ్రహం అన్నదాతల్లో వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వం రైతు కూలీలకు, కౌలు రైతులకు సాయం చేయలేదు కాబట్టి.. వారంతా మూకుమ్మడికి హస్తం పార్టీకే ఓట్లు గుద్దారు. ఇప్పుడు వారిలోనూ అసంతృప్తి మొదలైంది. ఇక మంత్రుల మాటలు మరింత గందరగోళం నింపుతున్నాయి. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాను అంటూ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి.. ట్యాక్స్​ పేయర్లకు రైతు బంధు అవసరం లేదని జీవన్​ రెడ్డి.. పంట సాగు చేస్తున్నట్టు నిర్ధారణ చేసుకున్నాకే సాయం చేస్తామని పొంగులేటి తలా ఓ మాట అన్నారు. భూ స్వాములకు రైతు బంధు ఇచ్చేది లేదంటూ మంత్రి సీతక్క ఓ స్టేట్​ మెంట్ ఇచ్చారు. ఇలా రైతుల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. వెరసి ఈ ఎఫెక్ట్​ మొత్తం రేవంత్​ మీద పడుతోంది.

జాతీయస్థాయిలో స్టార్​ క్యాంపెయినర్​ .. మరి రాష్ట్రంలో..
ప్రస్తుతం రేవంత్​ రెడ్డి కాంగ్రెస్​ పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్​ క్యాంపెయినర్​. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఆయనను ప్రచారానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. రేవంత్​ దూకుడుగా మాట్లాడుతారు.. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడతారని కాంగ్రెస్​ ఆయనను తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా కూడా వాడుకోవాలని చూస్తున్నది. కానీ సొంత రాష్ట్రంలోనే ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ మీద రేవంత్​ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్​ వైరల్​ అవుతున్నాయి. డిసెంబర్​ 9న అందరి రుణాలు మాఫీ చేస్తా.. మాఫీ అయినవాళ్లుంటు మళ్లీ రుణాలు తెచ్చుకోండి.. పవర్​ లోకి రాగానే మొత్తం మాఫీ చేస్తాం అంటూ రేవంత్​ స్టేట్​ మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అటకెక్కింది. రుణమాఫీ మీద తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్ట్​ 15 లోగా మాఫీ చేస్తామంటూ కొత్త స్టేట్​ మెంట్​ ఇచ్చారు రేవంత్​.. మరి రైతులు మాత్రం విశ్వసించడం లేదు.

పల్లెల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం
పల్లె సీమల్లో మూడు రకాలైన ప్రజలుంటారు.. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు.. చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకోనేవారు ఉన్నా వారి సంఖ్య ఎంతో పరిమితం.. అయితే గత ఎన్నికల సమయంలో ఈ మూడు వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. బీఆర్ఎస్​ హాయంలోనూ పల్లెలు సుభిక్షంగా ఉన్నాయి. అయితే తమకు సర్కారు నుంచి సాయం అందడం లేదన్న అసంతృప్తి రైతు కూలీల్లో, కౌలు రైతుల్లో గూడు కట్టుకున్నది. అందుకే రేవంత్​ వారిని టార్గెట్​ చేశారు. పట్టా రైతులతో పాటూ వారికీ సాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ ఊసు లేదు.. అసలు పంట పెట్టబడి సాయం విషయంలోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. తమకు రైతు బంధు వస్తుందా? లేదో కూడా రైతులకు తెలియడం లేదు.. ఇక గత ఎన్నికల్లో ఈ వర్గాలు గుంపగుత్తగా కాంగ్రెస్​ పార్టీకి ఓటేశాయి. కానీ పవర్​ లోకి రాగానే మేం లంకెబిందెలు ఉన్నాయనుకున్నాం.. ఇక్కడ ఖాళీ కుండలు దర్శనమిస్తున్నాయి అన్నప్పుడే హామీల విషయం అటకెక్కించారని చాలా మంది భావించారు. ఇక ఇప్పుడు అదే జరుగుతోంది. హామీల అమలులో నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారికి కోడ్​ ఏమీ అడ్డం రాలేదు.. అయినా ఈ విషయం పక్కకు పెట్టారు. ఇప్పుడు రుణమాఫీకి మరో డేట్​ చెప్పడంతో మరోసారి మభ్యపెట్టేందుకే ఇలా చేస్తున్నారని రైతాంగం భావిస్తోంది. ఒక లీడర్​ కు విశ్వసనీయత అత్యంత ముఖ్యం. చెప్పిన పనిని చేయకపోతే.. జనం నమ్మరు. కనీసం చెప్పినదాంట్లో 90శాతం చేసి 10 శాతం వదిలేస్తే క్షమిస్తారు.. కానీ మొత్తానికే పక్కకు పెడితే ఆగ్రహిస్తారు.. రేవంత్​ మీద ప్రస్తుతం ఇదే కోపం ఉంది. మరి ఆయన రైతుల కోపాన్ని ఎలా చల్లారుస్తారు.. ఈ ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి

Recent

- Advertisment -spot_img