తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు మండిపడ్డారు. విజయోత్సవాలు కాదు..అపజయోత్సవాలు జరపండి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేసారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని తెలిపారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్ళారు అని అన్నారు. కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డరు… రైతులు దారుణంగా మోసపోయారు అని హరీష్ రావు వాపోయారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి..? అని ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదు అని మండిపడ్డారు.
డిక్లరేషన్ లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు..రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదుని ద్వజమెత్తారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. మీ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లింది అని తెలిపారు. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టింది అని అన్నారు.కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవు అంటూ మండిపడ్డారు. మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి, సక్సెస్ ఫుల్ గా ప్రజల్నిమోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.ఏడాది కావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అద్భాతాలు చేసామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండి.. గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి సారించండి అని అన్నారు. మీ వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.