– ఈ ఎన్నికల్లో హంగ్‌కు అవకాశం లేదు
– కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తానైనా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తామని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం’అని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదని.. తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదన్నారు. రెండింట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్కు సహకరించే అధికారులను బదిలీ చేయాలి
ఎన్నికల కోడ్‌ను బీఆర్ఎస్ నేతలు ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కోడ్ ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరాం. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశాం. విశ్రాంత అధికారులకు పదవులు ఇచ్చి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రైవేటు ఆర్మీలా వాడుతున్నారు. విశ్రాంత అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరాం. విశ్రాంత అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ జీతభత్యాలతో ప్రైవేటు ఆర్మీని నియమించారు. కొత్త ఆర్మీతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేయించి కేసులు పెడుతున్నారు. కీలకమైన శాఖలను కొందరు ఐఏఎస్‌లు 7-8 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్ కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు’అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.