Homeహైదరాబాద్latest NewsRevanth Reddy సర్కార్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం ఈ కార్యక్రమం తుస్ : Politics

Revanth Reddy సర్కార్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం ఈ కార్యక్రమం తుస్ : Politics

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది. రేవంత్ పవర్ లోకి వచ్చిన వెంబడే ప్రజాదర్భార్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తొలిరోజే అప్పటి ప్రగతి భవన్ ముందున్న కంచెలు తొలగించి హడావుడి చేశారు. ఆ తర్వాతి రోజే ప్రజాదర్భార్ నిర్వహించారు. నేరుగా ముఖ్యమంత్రే దరఖాస్తులు తీసుకున్నారు. దీంతో పాత రోజులు గుర్తొచ్చాయని అంతా భావించారు. నిజానికి కేసీఆర్ హయంలో ప్రజాదర్భార్ అనే కార్యక్రమం నిర్వహించలేదు. ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వచ్చాయి. తమ ప్రభుత్వంలో సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయని.. సమస్యలు ముఖ్యమంత్రి దాకా వచ్చాయంటే వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టు అర్థం చేసుకోవాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఏదో కవర్ చేసుకొనేవారు కానీ.. కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి లేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతోనే రేవంత్ గద్దెనెక్కాక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రోగ్రామ్ క్రమంగా ఓ డ్రామాలాగా మారిపోయింది. మొదట ప్రజాదర్బార్ అన్నారు ఆ తర్వాత ప్రజావాణి అన్నారు. పేరు ఏదైనా ముఖ్యమంత్రి వచ్చింది ఒక్కరోజే.. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మంత్రులు వచ్చారు. కొంతకాలానికి వారు కూడా మొహం చాటేశారు. చివరకు హరిచందన అనే ఓ ఐఏఎస్ అధికారికి ఈ కార్యక్రమ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం డ్రామాలాగా మారపోయింది. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి? ఏ దశలో ఉన్నాయి? వంటి సమాచారం ఏదీ సర్కారు దగ్గర లేదు.

ప్రజాదర్బార్ ఎలా సాగాలి? ఎలా సాగుతోంది?
నిజానికి రాజశేఖర్ రెడ్డి తాను క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న ప్రతి రోజూ ప్రజల సమస్యలు తెలుసుకొనేవారు. వారి నుంచి అర్జీలు స్వీకరించి.. వాటిని సంబంధిత అధికారులతో పరిష్కారం అయ్యేలా చూసేవారు. అదే తరహాలో మరో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కార్యక్రమం మరుగునపడిపోయింది. అయితే రేవంత్ కూడా రాజశేఖర్ రెడ్డి తరహాలో ప్రజాదర్బార్ నిర్వహించాలని సంకల్పించారు. కానీ ఆ కార్యక్రమం పట్టుమని రెండు నెలలు కూడా సక్రమంగా సాగలేదు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు మొదలుపెట్టారు. ఎందుకు సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక పేరును ఎందుకు మార్చారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎలాగూ ప్రజావాణి పేరిట ఓ కార్యక్రమం నిర్వహించేవారు. ప్రతి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో, మండలకేంద్రాల్లో ఇదే పేరుతో కార్యక్రమం జరిగేది. ఈ ప్రోగ్రామ్ కొత్తగా నిర్వహిస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇచ్చారు? ఎందుకు కొనసాగించలేకపోయారు? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రే సమస్యలు వినాలనుకుంటే ఆయన రోజూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండొచ్చు.. కానీ ఆయన పాల్గొన్నది ఒక్కరోజు మాత్రమే. కేవలం మీడియాలో షో చేసేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్న విమర్శ ఉంది. ఇనుపకంచెలు బద్దలు కొట్టాం.. గడీల గోడలు బద్దలు కొట్టాం అని తొలుత బిల్డప్ ఇచ్చిన రేవంత్ సర్కారు ప్రస్తుతం ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది.

రశీదులు ఇవ్వడం లేదు
తొలుత ఈ ప్రజావాణి కార్యక్రమం గురించి ఊదరగొట్టారు. ఆ తర్వాత సమయం కుదించారు. కేవలం పది గంటల వరకు ప్రజాభవన్ వచ్చేవారి దరఖాస్తులు మాత్రమే తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ప్రజావాణికి దరఖాస్తులు చేసుకొనేందుకు పల్లెల నుంచి బాధితులు వస్తుంటారు. వారు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్ చేరుకోవాలంటే.. ముందురోజే నగరానికి రావాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ప్రజావాణి దరఖాస్తుల చేసుకున్న వారికి రశీదు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటివరకు హైదరాబాద్ ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అవి ఏ దశలో ఉన్నాయి? తదితర వివరాలేవి అధికారులు బయట పెట్టడం లేదు. తొలుత ముఖ్యమంత్రి వచ్చారు? ఆ తర్వాత మంత్రులు వచ్చారు? తర్వాత ఓ ఐఏఎస్ అధికారి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు దరఖాస్తులు ఎవరు తీసుకుంటున్నారో? కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది కూడా ఉదయం 10 గంటల వరకే నిర్వహిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరంభం శూరత్వం తప్ప ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img