ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ నియామాకాల పంపిణీ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని కానివ్వనని.. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని ప్రకటించారు. ఈ కామెంట్లు బీఆర్ఎస్ లీడర్లకు గుచ్చుకున్నాయో లేదో కానీ.. కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు మాత్రం గట్టిగా గుచ్చుకునేటట్టు ఉన్నాయి. సీఎం పోస్టు మీద అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న భట్టి, ఉత్తమ్‌కు ఈ కామెంట్లు గట్టి కౌంటర్లు అని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి.. దీనికి అధిష్ఠానం ఉంటుంది కాబట్టి.. ఎప్పటికైనా తాము ముఖ్యమంత్రులమవుతామని భట్టి, ఉత్తమ్ వంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వారికి దారులు అన్ని మూసుకుపోయినట్టే కనిపిస్తోంది.
తిరుగులేని లీడర్‌గా ఎదిగిన రేవంత్
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ కావడమే గొప్ప అనుకుంటే.. రేవంత్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే ఎక్కారు. అటువంటి నేత క్రమక్రమంగా తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో ఉండదని.. అందరికీ ప్రాధాన్యం ఉంటుందని.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించిననాడే.. ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు.. నిర్ణయాలు తీసుకొనేందుకు కూడా మంత్రులు ఎవరూ సాహసించడం లేదు.
అధికారం కోసమే బెండ్ అయ్యారా?
ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న లీడర్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దళిత కోటాలో తనకు అవకాశం వస్తుందని భట్టి భావిస్తే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తాను హైకమాండ్ కు వీర విధేయుడిని కాబట్టి తనకు సీఎం పోస్టు వస్తుందని భావించారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి, శ్రీధర్ బాబు వంటి నేతలు ఈ పోస్టు మీద కన్నేసినా.. పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. వారిని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోలేదు కూడా.. అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధిష్ఠానంతో సఖ్యతగా ఉన్న నేతలు తమ మార్క్ రాజకీయం చేస్తుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూరుస్తుంటారు. ముఖ్యమంత్రి సీటు మీద ఉన్నవారికి తలనొప్పిగా మారుతారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. మంత్రులంతా గప్‌చుప్‌గా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి అధిష్ఠానం నుంచి వారికి ఆ మేరకు ఆదేశాలు వచ్చాయా? లేదంటే కలిసిఉంటేనే అధికారం పంచుకోవచ్చని.. ముఖ్యమంత్రి కాకపోయినా.. కనీసం మంత్రి పదవైనా దొరికింది కదా అని సంతోషపడుతున్నారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లలో మునుపటి స్పీడ్ కనిపించడం లేదు. లోలోపల కొంతమంది లీడర్లు రగిలిపోతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రమే ఏం మాట్లాడలేకపోతున్నారని తెలుస్తోంది. పదేండ్ల పాటూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విధానాలకే విరుద్ధమన్న డిస్కషన్ కూడా సాగుతోంది. ఎవరు ముఖ్యమంత్రి? ఆయన ఎన్నేండ్లు ఉండాలి? అన్నది అధిష్ఠానమే డిసైడ్ చేస్తుంది. కానీ అధిష్ఠానం ఆశిస్సులు, ప్రజల దీవెనతో తాను పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ చెప్పలేదు. ఓ ప్రాంతీయ పార్టీ అధినేతలా మాట్లాడారు. మరి హైదరబాద్ లో ఉన్న కాంగ్రెస్ పరిశీలకులు ఈ మాటను విన్నారా? ఈ విషయం అధిష్ఠానం చెవిన వేస్తారా? అన్నది వేచి చూడాలి. రేవంత్ ఏ ధైర్యంతో అటువంటి కామెంట్లు చేశారో.. అధిష్ఠానం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.