- కల్యాణ్ లక్ష్మి చెక్కులు పంచిన ముఖ్యమంత్రి సోదరుడు
- ఏ హోదాతో చెక్కులు పంచుతారంటూ నెటిజన్ల ఆగ్రహం
- ముఖ్యమంత్రి సోదరుడు కావడమే మీ అర్హతా అంటూ కామెంట్లు
- కేసీఆర్ ది కుటుంబ రాజకీయాలైతే .. మరి మీవేంటి?
- సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొంటుంటారు. కానీ రాష్ట్రంలో అప్పుడప్పుడూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనడమే తప్పైతే.. తాజాగా ముఖ్యమంత్రి సోదరుడు, కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేని వ్యక్తి అయిన తిరుపతి రెడ్డి ఏకంగా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం కొడంగల్ సెగ్మెంట్ పరిధిలోని కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దీంతో జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ఒకటి ఉంటుందని దాని ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.
గతంలో రేవంత్ విమర్శలు.. ఇప్పుడేమంటారో..
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆయన కుటుంబం మీద ఇంతెత్తున ఎగిరిపడుతుంటారు. బీఆర్ఎస్ కుటుంబపార్టీ అని.. ఆ పార్టీ పదవులను పంచుకున్నదని ఆయన ఆరోపిస్తుంటారు. అయితే అదే పరిస్థితి రేవంత్ ఫ్యామిలీలోనూ వచ్చింది. తిరుపతి రెడ్డి నిత్యం కొడంగల్ సెగ్మెంట్ లోనే ఉంటున్నారు. షాడో ఎమ్మెల్యేలగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు ఏం కావాలన్నా ఆయనే చూసుకుంటున్నారు. అధికారులను ఆదేశిస్తున్నారని.. పోలీసులను తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఓ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్న తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల అధికారులు ప్రతి నిత్యం ఏది జరిగినా ఆయనకు రిపోర్టు చేయాల్సిందే అని వినిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రివ్యూల్లోనూ తిరుపతి రెడ్డి పాల్గొంటున్నారు. ఎవరేం చేయాలో ఆయనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని ఆరోపణలున్నాయి. అంతటి పవర్ ఫుల్ లీడర్‌ను కాదని కొడంగల్ లో ఏ అధికారి కూడా పని చేయలేరని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయననే అన్ని కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తుంటారని తెలుస్తోంది.