– ఇరు రాష్ట్రాల కీలక సమస్యలపై చర్చలు
– సీఎం ఏపీ పర్యటనపై నెలకొన్న ఆసక్తి
ఇదేనిజం, ఏపీ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం విజయవాడకు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ , ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించకోనున్నారు. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారని సమాచారం. కీలక అంశాలపై వారు చర్చించనున్నట్లు తెలిసింది. అయితే సీఎం ఏపీ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, వచ్చే జూన్‌తో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్న గడువు ముగియనుంది. అదేవిధంగా నీటి వివాదాలు, పెండిరగ్ విభజన అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగితే పై అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఏపీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.