Homeహైదరాబాద్latest News​రేవంత్​ ఆలోచనా విధానం పిచ్చి తుగ్లక్​ను తలపిస్తుంది.. ఆనవాళ్లు లేకుండా చెరిపివేయాలన్న భావనతో ఇష్టారీతిన పనులు

​రేవంత్​ ఆలోచనా విధానం పిచ్చి తుగ్లక్​ను తలపిస్తుంది.. ఆనవాళ్లు లేకుండా చెరిపివేయాలన్న భావనతో ఇష్టారీతిన పనులు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్​ ఆలోచనా విధానం పిచ్చి తుగ్లక్​ను తలపిస్తున్నాయి. కేసీఆర్​ ఆనవాళ్లు చెరిపివేయాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పిచ్చి పరాకాష్ఠకు చేరిందేమో అన్న ఆశ్చర్యమూ కలుగుతోంది. తాజాగా రేవంత్​ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పాఠ్యపుస్తకాల ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు.. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేరు పడిందట. దీంతో మొత్తం పుస్తకాల పంపిణీనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్​ పేరు, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేరు ఉంది. దీంతో తెలుగు పాఠ్య పుస్తకాల పంపిణీని నిలిపివేశారు.

పిచ్చి పీక్స్​ కు చేరిందా?
ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏపీలో గత ముఖ్యమంత్రి జగన్​.. విద్యార్థులకు కోసం లక్షల సంఖ్యలో స్కూల్​ బ్యాగులు తయారుచేయించారు. ఈ బ్యాగుల మీద వైసీపీ రంగులు, జగన్​ మోహన్​ రెడ్డి చిత్రం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్యాగుల మీద జగన్​ ఫొటో ఉండటంతో వాటిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు తటపటాయించారు. కానీ చంద్రబాబు మాత్రం ఎంతో హుందాగా.. పెద్ద మనసుతో వ్యవహరించారు. బ్యాగులపై ఎవరి ఫొటో ఉన్నా పర్వాలేదు.. విద్యార్థులకు మేలు జరగడమే ముఖ్యమన్న భావనతో వాటి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇక గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ సైతం ఇటువంటి నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పేరుతో ఉన్న అమ్మ క్యాంటిన్లను ఆయన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాజాగా పుస్తకాల పంపిణీని నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది.

ఆనవాళ్లు చెరిపివేయాలంటే ఏం చేయాలి?
తెలంగాణలో కేసీఆర్​ ఆనవాళ్లు చెరిపేయాలి.. ముఖ్యమంత్రి రేవంత్​ దీన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అలా చేయాలంటే తన మార్క్​ పాలన చూపించాలి. గత ప్రభుత్వాన్ని తలదన్నేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. తన పేరు పదికాలాల పాటు గుర్తు పెట్టుకొనేలా సంక్షేమ పథకాలు రూపొందించాలి. పకడ్బందీగా అమలు చేయాలి కానీ.. అలా కాకుండా గత ముఖ్యమంత్రుల ఆనవాళ్లు చెరిపివేయాలనే ఉద్దేశ్యంతో ముందుమాటలో కేసీఆర్​ పేరు ఉందని .. విద్యార్థులకు పుస్తకాల పంపిణీనే నిలిపివేయాలనే ఆలోచన ఎంతవరకు సబబనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తగ్గించినంత మాత్రాన ఎవరూ తగ్గలేరని.. వేమన పద్యంలో చెప్పినట్టుగా ‘ కొండ అద్దమందు కొంచమై ఉండదా’ కొండను అద్దంలో చూసి అది చిన్నగా ఉన్నట్టు భావించినంత మాత్రాన దాని పరిమాణం ఏమీ తగ్గదు. అలాగే కేసీఆర్​ ను ఎంత తక్కువ చేసే ప్రయత్నం చేసినా.. ఆయన స్థాయి తగ్గదంటున్నారు ఆయన అభిమానులు. ఇక కేసీఆర్​ ఆనవాళ్లు చెరిపివేయాలనే ఉద్దేశ్యంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా.. ఆయన పేరు ప్రజల్లో మారుమోగిపోతున్నది.

పిచ్చి నిర్ణయం నష్టపోయేది విద్యార్థులే..
తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్​ పేరు ఉందని వాటి పంపిణీ నిలిపివేస్తే అంతిమంగా విద్యార్థులే నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాలను ఇప్పుడు మళ్లీ ప్రింట్​ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన ప్రింట్ చేసినా.. మూడు నెలల సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అంటే దాదాపు త్రైమాసిక పరీక్షల వరకు విద్యార్థులకు పుస్తకాలు అందవు. దీంతో వారు నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img