“రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి హాయిగా, ప్రశాంతంగా ఫిడేలు వాయించుకుంటున్నారు”
రోమన్ చక్రవర్తి నీరో గురించి చెప్పుకుంటే చాలా మందికి ఈ మాట గుర్తొస్తుంది. రోమ్ నగరానికి నిప్పు పెట్టించారనే ఆరోపణలు కూడా నీరో మీద ఉన్నాయి. ఆయన కావాలనే అలా చేశారని చెబుతారు.
తన తల్లిని, సవతి సోదరులను, భార్యలను హత్య చేయించి, తన దర్బారులో ఉన్న నపుంసకులను పెళ్లాడిన ఒక క్రూర నియంతగా నీరోను వర్ణిస్తారు.
క్రీ.శ 54లో తన తల్లి ప్రయత్నాలతో నీరో 16 ఏళ్లకే విశాల రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యారు.
అప్పుడు రోమ్ సామ్రాజ్యం స్పెయిన్ నుంచి ఉత్తరాన బ్రిటన్, తూర్పున సిరియా వరకు వ్యాపించి ఉండేది.
సింహాసనం మీద ఆశతో నీరో తల్లి అగ్రిపీనా.. రాజమహల్లో కుట్రలు చేసి, అందరి మధ్యా చిచ్చుపెట్టి కుమారుడికి అది దక్కేలా చేశారు.
అగ్రిపీనా తనకు మామయ్య అయిన చక్రవర్తి క్లాడియస్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత చక్రవర్తి కూతురితో నీరో పెళ్లి జరిపించారు.
దాంతో రాజ పరివారంలో నీరో సభ్యుడయ్యారు. రాజుకు అప్పటికే ఒక కొడుకున్నప్పటికీ, సింహాసనానికి వారసుడు అయ్యారు.
అగ్రిపీనా విషపూరితమైన పుట్టగొడుగులు తినిపించి చక్రవర్తి క్లాడియస్‌ను చంపేశారని చెబుతారు. కానీ అందులో నిజమెంత అనేది ధ్రువీకరించలేకపోయారు.
తల్లినే చంపించిన నీరో
నీరో అధికారంలోకి వచ్చినపుడు, తల్లి అగ్రిపీనా ఆయనకు ఆంతరంగిక సలహాదారుగా ఉన్నారు.
పాలనలో ఎంత ఆధిపత్యం చూపించేవారంటే, రోమన్ నాణేల మీద నీరో చిత్రంతోపాటూ ఆమె బొమ్మ కూడా ఉండేది.
కానీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఐదేళ్ల తర్వాత నీరో తన తల్లిని హత్య చేయించారు. ఆయన బహుశా ఎక్కువ స్వేచ్ఛ, శక్తిని కోరుకున్నారు.
నీరో తన తల్లిని ఎందుకు హత్య చేయించారు?
ప్రాచీన రోమ్ గురించి పరిశోధన చేసిన నిపుణులు, ప్రొఫెసర్ మారియా వాయెక్ నీరో గురించి రేడియోలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.
“నీరో తల్లి ప్రవర్తన చాలా ఆధిపత్యంతో ఉండేది. కొన్నిఆధారాలను బట్టి, ఆమె కొడుకును తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించేవారని తెలుస్తోంది.
అది ఏ స్థాయికి చేరిందంటే, ఆమె చివరికి కొడుకుతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి కూడా వెనకాడలేదు” అని చెప్పారు.
“అయితే నీరోకు తన తల్లితో లైంగిక సంబంధం ఉన్నట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు.
కానీ లభించిన ఆధారాల ప్రకారం నీరో పంపించిన హంతకులు అగ్రిపీనా దగ్గరకు వచ్చినపుడు, ఆమె వారికి తన కడుపును చూపిస్తూ నన్ను ఇక్కడ పొడిచి చంపండి. నీరో పాపం ఇక్కడే పెరుగుతోంది అన్నారట”
నీరో చిన్నతనం నుంచే అధికార సంఘర్షణను చూశారని, ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా పడిందని మారియా చెప్పారు.
అధికారం కోసం పెళ్లిళ్లు, హత్యలు
నీరో పాలన గురించి మారియా వాయెక్ మాట్లాడారు.
“మనం రోమన్ సామ్రాజ్యం యూరప్‌లో బ్రిటన్ నుంచి ఆసియాలో సిరియా వరకు వ్యాపించిన మొదటి శతాబ్దం గురించి మాట్లాడుకుంటున్నాం.
కానీ, ఆ విశాల సామ్రాజ్యం అస్థిరంగా ఉండేది. ఒక స్వతంత్ర దేశాధినేత, సెనేట్ సాయంతో దానిని నడిపేవారు.
రోమన్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి అగస్టస్ ప్రారంభించిన వ్యవస్థలో రాజ్యాధికారం జూలియస్ క్లాడియస్ సీజర్ కుటుంబంలోనే తరతరాలవారికి దక్కాలని కోరుకున్నారు”
“ఫలితంగా అధికారం చేజిక్కించుకోడానికి కుటుంబంలో సంఘర్షణ మొదలైంది.
అధికారం కోసం కుటుంబంలో పెళ్లిళ్లు, పిల్లలను దత్తత తీసుకోవడం, విడాకులు, రాజ్య బహిష్కరణతోపాటూ ప్రత్యర్థులను అంతం చేయడం లాంటి అన్ని వ్యూహాలూ ఉపయోగించారు” అంటారు ప్రాచీన రోమ్ గురించి పరిశోధన చేసిన నిపుణులు, ప్రొఫెసర్ మారియా వాయెక్.
రోమన్ సామ్రాజ్యంలో రెండో చక్రవర్తి టిబెరియస్ పాలనాకాలంలో నీరో నానమ్మను జైలులో బంధించారు.
మూడో రాజు పాలనాకాలంలో నీరో తల్లిని దేశ బహిష్కరణ చేశారు. ఆమె క్లాడియస్ పాలనాకాలంలో తిరిగి రాజ్యంలోకి రాగలిగారు.
చివరకు తనకు మామయ్య అయిన చక్రవర్తిని పెళ్లి కూడా చేసుకుని రాజ పరివారంలో చోటు సంపాదించారు.
రేడియో కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ సౌత్ హాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుష్మా మలిక్ కూడా నీరో వ్యక్తిత్వం, చరిత్ర గురించి వివరించారు.
“రోమన్ సామ్రాజ్యానికి నాలుగో చక్రవర్తి అయిన క్లాడియస్ క్రీ.శ 41 నుంచి 54 వరకు పాలించారు.
తన పాలనాకాలం చివరి రోజుల్లో క్లాడియస్ తన భార్యలపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారిలో నీరో తల్లి అగ్రిపీనా కూడా ఒకరు” అని చెప్పారు.
ఆయన భార్యల్లో ముస్లీనా అనే మహిళ గురించి చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఆమె క్లాడియస్ చుట్టూ తన అనుచరులను ఉంచేవారు.
ముస్లీనా సెనేటర్లతో శారీరక సంబంధాలు కూడా పెట్టుకునేవారని చెబుతారు.
ఆమె తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి తన పదవిని కూడా పట్టించుకోలేదని అంటారు.
క్లాడియస్ ఆమెకు చాలా ప్రభావితమయ్యారని చరిత్ర ద్వారా తెలుస్తోంది” అని సుష్మా తెలిపారు.
క్లాడియస్ పాలనాకాలంతో పోలిస్తే, నీరో పాలన తొలి రోజుల్లో ఆయన చుట్టూ కొంతమంది మంచివాళ్లుండేవారు.
వారిలో నీరో ప్రసంగాలు రాసే తత్వవేత్త సెనెకా, అఫ్రెక్స్ బ్రూస్ అనే ఒక అధికారి ఉండేవారు.
భార్యలను చంపించిన నీరో
నీరో తన మొదటి భార్య ఆక్టేవియాతో విసిగిపోయి, ఆమెను రాజ్య బహిష్కరణ చేశారు. తర్వాత ఆమెను చంపాలని ఆదేశించారు.
ఆ తర్వాత నీరో పోపియాతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లాడారు. ఆయన ఒక రోజు కోపంతో గర్భంతో ఉన్న పోపియాను కూడా చంపేశారు.
నీరో పాలనలో మొదటి ఐదేళ్లనూ రోమ్ ప్రజలకు స్వర్ణయుగంగా భావిస్తారు. ప్రాచీన రోమ్‌లో సెనేట్, పాలనాపరమైన సలహాలు ఇచ్చే ఒక సంస్థ ఉండేది.
రోమన్ సెనేట్‌కు నీరో సర్వాధికారాలు ఇచ్చారు. తనతో ఉండే రోమన్ సైన్యానికి ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు.
క్రీడాపోటీలు, వేడుకలు నిర్వహిస్తూ జనాదరణ పొందారు.
కానీ, నీరో మిగతా పాలనాకాలంలో జరిగిన దారుణమైన హింస, క్రూరత్వం చాటున ఆ మొదటి విజయాలు మరుగునపడిపోయాయి.
నీరో తన పాత్ర వల్ల చరిత్రలో చెడుకు, క్రూరత్వానికి ఒక ప్రతీకగా నిలిచిపోయారు.
క్లాడియస్ సమయంలో సెనేట్‌ను నిర్లక్ష్యం చేసినట్టు తన కాలంలో జరగదని నీరో మొదట్లో సెనేట్‌కు భరోసా ఇచ్చారు.
రాచరిక వ్యవహారాల్లో సెనేట్ ప్రాధాన్యం పునరుద్ధరిస్తానని వారికి చెప్పారని బ్రిటన్ సౌత్ హాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుష్మా మలిక్ తెలిపారు.
అంతకుముందు సెనేట్ సభ్యులు ఒకరికొకరు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు.
అలాంటి తిరుగుబాటు ప్రయత్నాలు కూడా ఉండవని నీరో వారికి చెప్పే ప్రయత్నం చేశారు.
“తొలి రోజుల్లో సెనేట్ విశ్వాసం పొందాలని నీరో శతవిధాలా ప్రయత్నించారు.
రోమ్‌కు ఒక మెరుగైన పాలకుడినని నిరూపించుకుంటానని వారికి నమ్మకం కలిగించాలనుకున్నారు” అంటారు సుష్మ.
అంతేకాదు, రోమ్ ప్రజలను సంతోషపరచడానికి నీరో క్రీ.శ 54లో గ్రీకుల్లాగే భారీ స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించారు.
ఆ క్రీడలతోపాటూ ప్రజలకు వినోదం అందించడానికి సర్కస్ లాంటి చాలా ప్రదర్శనలు పెట్టించేవారు.
చారిత్రక సందర్భాలను బట్టి నీరో పాలన తొలిరోజులను రోమ్ స్వర్ణయుగం అనవచ్చని బ్రిటన్ సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ నికొల్స్ చెప్పారు.
“ఆధునిక కాలంలో కూడా ప్రజల్లో పాపులారిటి పెంచుకోవడానికి పాలకులు మొదట్లో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కానీ, మెల్లమెల్లగా వారి పాలనా పద్ధతుల వల్ల ఆ జనాదరణ తగ్గిపోతోంది” అని బ్రిటన్ సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ నికొల్స్ అన్నారు.
నీరోకున్న జనాదరణ ఆయన చివరి రోజుల వరకు అలాగే కొనసాగిందని మాథ్యూ చెప్పారు.
జూలియస్ క్లాడియస్ రాజవంశంలో నీరో ఐదవ, చివరి చక్రవర్తి అన్నారు.
“నీరో అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన ముందు చాలా సమస్యలు ఉన్నాయి.
ఆయన గద్దెనెక్కినపుడు పాలన స్థిరంగా ఉంది. కానీ, అధికారం కోసం కుటుంబంలో తీవ్ర సంఘర్షణ, కుట్రలు జరుగుతున్నాయి.
దీంతోపాటూ సెనేట్‌లోని సంపన్న వర్గాలను సంతృప్తి పరచడం కూడా చాలా ముఖ్యం. ప్రాంతీయ గవర్నర్ దగ్గర సైన్యం ఉండేది.
వీటన్నిటికంటే ముఖ్యంగా రోమ్ ప్రజలకు క్రీడలు, సంబరాలు అంటే చాలా ఆసక్తి.
దానికి తగినట్లు ఏవైనా చేయాల్సిన అవసరం నీరోకు వచ్చింది” అని మాథ్యూ అన్నారు.
నీరో వాటన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. ఆయన అందరినీ సంతృప్తిపరచాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
చక్రవర్తి అయ్యే సమయానికి, ఆయన పాలన అంతమయ్యే సమయానికి రోమ్ సామ్రాజ్యంలో తేడా లేదా అనే ప్రశ్నకు కూడా మాథ్యూ సమాధానం ఇచ్చారు.
“ పాలనాకాలంలో రోమ్ సామ్రాజ్యాన్ని విస్తరించలేదు.
కానీ దానిని అప్పుడు సుస్థిరంగా ఉంచడం కూడా ఒక సవాలే” అన్నారు.
కొత్తగా సాధించిన విజయాలేవీ లేకపోవడంతో కప్పం రావడం కూడా ఆగిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో దానిని సుస్థిరంగా ఉండేలా చూసుకోవడం చాలా కష్టమైపోతుందని మాథ్యూ చెప్పారు.
రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్నారా
క్రీ.శ. 64వ సంవత్సరంలో రోమ్ తగలబడి బూడిదైపోయింది.
నీరో స్వయంగా నగరానికి నిప్పు పెట్టించారని, రోమ్ తగలబడుతుంటే ఆయన ఫిడేలు వాయిస్తున్నారనే వదంతులు ఉన్నాయి.
“నీరోనే స్వయంగా రోమ్‌కు నిప్పు పెట్టించారని, అలా రోమ్‌ను మళ్లీ కొత్తగా నిర్మించవచ్చని భావించారని రెండు, మూడో శతాబ్దంలో కనీసం ఇద్దరు చరిత్రకారులు ధ్రువీకరించారు.
తర్వాత నీరో తన ప్రముఖ గోల్డెన్ హౌస్‌ను నిర్మించాలని కూడా అనుకున్నారు” అని బ్రిటన్ సౌత్ హాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుష్మా మలిక్ చెప్పారు.
కానీ కొంతమంది చరిత్రకారులు మాత్రం ఈ మంటలు ఆయన పెట్టించలేదని వాదిస్తున్నారు.
ఆ మంటల్లో ఆయన భవనం కూడా తగలబడిపోయిందని చెబుతున్నారు.
నీరో నిప్పు పెట్టించారనేది కేవలం వదంతులేనని అదే కాలానికి చెందిన మరో చరిత్రకారుడు టెసిటస్ చెప్పారని సుష్మా మలిక్ తెలిపారు.
“నీరో స్వయంగా అలా చేశాడనడం హాస్యాస్పదం. తర్వాత నగరాన్ని నీరో చాలా చక్కగా మళ్లీ నిర్మించారు.
ఇంకోసారి అగ్నిప్రమాదం జరిగితే మంటలు వేగంగా అంటుకోకుండా విశాలమైన రహదారులు నిర్మించారు. మెరుగైన నిర్మాణ సామగ్రి ఉపయోగించారు” అన్నారు.
కానీ నీరోనే స్వయంగా నగరానికి నిప్పు పెట్టించినట్లు రెండు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని మాథ్యూ చెప్పారు.
ఒక దానిలో నగరం తగలబడుతున్నప్పుడు నీరో ప్రత్యేక దుస్తులు ధరించి పాటందుకున్నారని వాటిలో ఉందని తెలిపారు.
రోమ్ తగలబడుతుంటే, నీరో ఫిడేలు వాయిస్తున్నారనేది ఎంత వరకూ నిజం అనే ప్రశ్నకు కూడా బ్రిటన్ సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ నికొల్స్ సమాధానం ఇచ్చారు.
“ఫిడేలును ఏడో శతాబ్దంలో ఆవిష్కరించారు. నీరో కాలంలో అది లేదు.
ఆ సమయంలో నీరో కచ్చితంగా ఒక వాయిద్యాన్ని వాయించారు. కానీ దానిని లైర్ అంటారు” అని మాథ్యూ చెప్పారు.
క్రైస్తవులను సజీవ దహనం చేశారనే ఆరోపణలు
రోమ్ నగరానికి నిప్పు పెట్టారని నీరో మైనారిటీలైన క్రైస్తవులపై ఆరోపణలు వేశారు.
“అప్పటి రోమ్‌లో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. క్రైస్తవుల మత విశ్వాసాల గురించి సామాన్యులకు చాలా తక్కువగా తెలిసేవి.
దాంతో వారిని అందరూ ద్వేషించేవారని టెసిటస్ ఒక పుస్తకంలో రాశారు” అని సుష్మా మలిక్ చెప్పారు.
అప్పట్లో మైనారిటీలైన క్రైస్తవులపై ఆరోపణలు చేయడం చాలా సులభం. వాటిని జనం సులభంగా నమ్మేశారు.
ఆ తర్వాత క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న నీరో, నగరానికి నిప్పుపెట్టినందుకు శిక్షగా వారిని బహిరంగంగా ఉరితీయించారు.
వారిని తోడేళ్లకు ఆహారంగా వేశారు. రాత్రిళ్లు క్రైస్తవులను సజీవ దహనం చేసేవారు. వాటిని చూడ్డానికి ప్రజలు భారీగా గుమిగూడేవారు అని చెప్పారు.
అరకొరగా మిగిలిన నీరో మహల్
రోమ్ తగలబడిన తర్వాత నీరో ఒక భారీ భవనాన్ని నిర్మించారు. అందులో ఒక బంగారు గది ఉండేదని, లోపల అద్భుతమైన ఫర్నీచర్, గదిలో సువాసన కోసం గోడల్లో పెర్‌ఫ్యూమ్ పైపులు కూడా ఉండేవని చెబుతారు.
ఆ భవనం నిర్మించడానికి నీరో భారీగా ఖర్చు చేశారు. కానీ దానిని ఎప్పటికీ పూర్తి చేయలేకపోయారు.
బూడిద కుప్పల నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్న ఒక నగరంలో అంత భారీ భవనం నిర్మించడంపై ప్రజలు అసంతృప్తితో ఉండేవారు.
దాంతో ఆ భవనాన్ని మీకోసం తెరుస్తామని, అక్కడ క్రీడలు, వేడుకలు నిర్వహిస్తామని నీరో వారిని సంతృప్తిపరిచేవారు.
లైర్ వాయిస్తూ, పాటలు పాడడమంటే నీరోకు ఇష్టం. ఆయన వేదికపై నటించేవారు కూడా.
చక్రవర్తికి అలాంటి అభిరుచులు ఉండడం సెనేట్ దృష్టిలో ఆయన ప్రతిష్టకే వ్యతిరేకం. కానీ నీరో ఎవరినీ పట్టించుకునేవారు కాదు.
ఆయన ఒకసారి సెలవు పెట్టి గ్రీస్ వెళ్లిపోయారు. అక్కడ థియేటర్లలో నాటక పోటీల్లో పాల్గొన్నారు.
‘ప్రజా శత్రువు’ నాటకీయ మరణం
30వ ఏట అడుగు పెట్టేసరికే నీరో చాలా అప్రతిష్ట మూటగట్టుకున్నారు, ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది.
దీంతో సైన్యం సాయంతో సెనేట్.. నీరోను ‘ప్రజా శత్రువు’గా ప్రకటించింది.
అంటే ఒక విధంగా అది నీరోకు మరణ శాసనం లాంటిది. అంటే నీరో ఎక్కడ కనిపించినా చంపేయాలి.
సైనికులు ఆయన్ను వెంటాడేవారు. నీరో ఒకరోజు రాత్రి చీకట్లో పారిపోయి నగరం బయట ఉన్న తన ఒక మహల్‌లో దాక్కున్నారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్నప్పుడు నీరో చివరగా “క్వాలిస్ ఆర్టిఫెక్స్ పెరియో” అనే మాట అన్నట్టు చెబుతారు.
అయితే ఆయన చివరి మాటలకు అర్థం కచ్చితంగా తెలుసుకోవడం కష్టమని నిపుణులు అంటున్నారు.
కానీ ఆ మాటకు చాలా అర్థాలు ఉండచ్చు.
“నేను నా మరణంలో కూడా ఒక కళాకారుడినే”
“నాతోపాటు కళాకారుడు కూడా చచ్చిపోతున్నాడు”
“నేను ఒక వ్యాపారిలా మరణిస్తున్నాను”
నీరో మాటలకు వీటిలో ఏ అర్థం అయినా రావచ్చు. కానీ ఆయన చివరి మాటలు ఆయన చరిత్రలాగే నాటకీయతతో మిగిలిపోయాయి.