లాన్సెట్ జర్నల్ వెల్లడి
మాస్కో: రష్యా హడావుడిగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. దీని ద్వారా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. శుక్రవారం విడుదలైన ఈ జర్నల్‌లో రష్యా వ్యాక్సిన్ వివరాలను పొందుపరిచారు. ఈ ఏడాది జూన్-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్ అందించారు. వారందరిలోనూ 100 శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు పెద్దఎత్తున పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది.
విమర్శలకు తాళం
ప్రపంచంలో వ్యాక్సిన్ కనుగొన్న దేశంగా రష్యా ప్రకటించుకుంది. ఆ దేశంలో వైద్యులు, వైద్య సిబ్బందికి మొదటగా ఇచ్చారు. అయితే ఆ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ దేశాలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొన్ని దేశాలు తమకు వ్యాక్సిన్ ఇవ్వండని ఆర్డర్లు కూడా చేశాయి. వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేకపోవడంతో రష్యాపై విమర్శలు వచ్చాయి. లాన్సెట్ ప్రచురణతో తమ చేతికి ఆయుధం దొరికిందని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రియేవ్ అన్నారు.