Russia : మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ పేరుతో ఉక్రెయిన్ చేపట్టిన రహస్య ఆపరేషన్ రష్యా భూభాగంలో విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో తొలిసారిగా, ఉక్రెయిన్ రష్యా లోతైన భూభాగంలోకి వందల కిలోమీటర్లు చొచ్చుకెళ్లి, నాలుగు కీలక వైమానిక స్థావరాలపై డ్రోన్లతో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా బాంబర్ విమానాలు, వాటిలో టీయూ-95, టీయూ-22 ఎం-త్రీ బాంబర్లు, ఏ-50 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ అనేది ఉక్రెయిన్ రూపొందించిన ఒక రహస్య ఆపరేషన్. 117 డ్రోన్లతో 18 నెలల పాటు రహస్యంగా ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్, రష్యాకు దాదాపు 7 బిలియన్ డాలర్ల (సుమారు 17,000 కోట్ల రూపాయలు) నష్టం కలిగించినట్లు అంచనా వేస్తున్నారు. ఇర్కుట్స్క్ గవర్నర్ కూడా ఈ దాడులను ధ్రువీకరించారు.
ఈ దాడుల నేపథ్యంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక శాంతి చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ తమ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. అయితే ఈ భీకర డ్రోన్ దాడులు చర్చలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? రష్యా ప్రతీకార దాడులకు దిగుతుందా? లేక శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడతాయా? ఈ ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
ఈ దాడుల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం గురించి ఊహాగానాలు పెరిగాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడికి సిద్ధమవుతోందనే వార్తలు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అనే ప్రశ్నలు మళ్లీ ప్రబలంగా వినిపిస్తున్నాయి.