ఇదే నిజం, నిజామాబాద్: బీఆర్ఎస్ దెబ్బకు బందయిన రైతు బంధు మళ్లీ పడుతోందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తాను బస్సెక్కి పిడికిలి బిగించగానే ప్రభుత్వానికి దెయ్యం వదిలిందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం రాత్రి నిజామాబాద్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ పార్క్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగించారు.‘ఇన్నాళ్లు బందుపెట్టిన రైతుబంధును మళ్లీ మొదలుపెట్టారు. కేసీఆర్ రథం ఎక్కంగనే దెబ్బకు దెయ్యం వదిలింది. నేను బస్సెక్కి గర్జన చేశాను కాబట్టే రైతుబంధు పడుతున్నది. పోరాడితే తప్ప ఏదీ జరగదు. అందుకే మీకు చెప్తున్న. తెలంగాణ శక్తి , బలం, గళం, దళం బీఆర్‌ఎస్ పార్టీనే. ఇయ్యాల బీఆర్‌ఎస్ పిడికిలి బిగిస్తెనే దెయ్యం వదిలి.. ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతుబంధు ఇస్తున్నారు’అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు వరి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్… ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ‘రూ.2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు పోరాడుతాం. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లను సైతం కాంగ్రెస్ పక్కన పెట్టేసింది. కేసీఆర్ కిట్టు నిలిపేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. తెలంగాణలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇలా మారిందంటే… దానికి కాంగ్రెస్ పార్టీ అసమర్థత కారణం కాదా? ఐదేళ్లు ఈ ప్రభుత్వం కొనసాగుతుందా?’అని కేసీఆర్ ప్రశ్నించారు.
అచ్చేదిన్ అంటే రైతులకు చచ్చేదిన్..
మోడీ పాలనలో తెలంగాణకు ఏదైనా మేలు జరిగిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు చెప్పారని, అందులో ఒక్కటైనా నిజమైందా? అని అన్నారు. మోదీ అచ్చే దిన్ అంటే.. రైతులకు చచ్చేదిన్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా.. సాగు ఖర్చులు డబుల్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి భాయ్ భాయ్ అని పిలుచుకుంటారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణాకు అన్యాయం చేశాయి. మోడీ పాలనలో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ కాలేదు. దేశం సత్తెనాశ్ అయ్యింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా పెంచి సామన్యుల నడ్డి విరిచారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తానని చెప్పారు.. చేశారా’అని కేసీఆర్ ప్రశ్నించారు.
నేనూ హిందువునే..
యువత ఆవేశంలో ఓటేయద్దని.. ప్రజాస్వామ్య పరిణితితో, విజ్ఞతతలో ఆలోచించి వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందోనని చర్చించి ఓటేయాలన్నారు. ‘నేను కూడా హిందువునే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి. అన్ని వర్గాలు మంచిగా ఉండాలి. హిందూ –ముస్లిం భాయ్ భాయ్ ఉండాలి. అందరం కలిసి బతకాలి. దాంట్లోనే గొప్పతనం, బలం ఉంటుంది. కానీ ప్రజలను విడదీసేలా మతవిద్వేషాలు రెచ్చగొడితే లాభం ఉండదు. మీ ఎంపీ నోరు తెరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో, గందరగోళం ఉంటదో తెలుసు. అన్ని విషయాల్లో మోడీని వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్టు చేసి జైలులో పెట్టారు. నేను భయపడను. కాంప్రమైజ్ కాను. పోరాటం చేయడమే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోలేదు’అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
14 సీట్లు వస్తే మనమే కీలకం..
మోడీకి కేంద్రంలో మెజార్టీ వచ్చే అవకాశం లేదని కేసీఆర్ అన్నారు. ‘ఎన్డీఏ కూటమికి 250 కంటే మించి సీట్లు రావు. మనం 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ కీలకంగా మారుతుంది. బీజేపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. ప్రాంతీయ శక్తులే ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తది. అప్పుడు మనది కీలక పాత్ర అయితది. ఈ రాష్ట్రంలో బీజేపీ వారిని ఓడించింది బీఆర్ఎస్సే. కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైతాయి.. ఆ మోసం కూడా చేస్తరు. కాబట్టి ఇప్పుడు రైతులకు రైతుబంధు ఎలా వేస్తున్నారో.. అలానే అన్ని హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు. సభలో అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గణేష్, జీవన్ రెడ్డి, ఆయేషా తదితరులు పాల్గొన్నారు.