తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆర్థిక శ్రేయస్సు కోసం ‘రైతు భరోసా’ పథకం ద్వారా మరో ముందడుగు వేసింది. మూడు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం నిధులను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా రూ.1,551.89 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని తీసుకొస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకోండిలా..
రైతు భరోసా పథకం కింద తమ దరఖాస్తు స్థితిగతులు, చెల్లింపు వివరాలు తెలుసుకోవడానికి రైతులు సులభమైన ఆన్ లైన్ విధానాన్ని అనుసరించవచ్చు.
*వెబ్ సైట్ సందర్శించండి: ముందుగా, అధికారిక వెబ్ సైట్ www.rythubharosa.telangana.gov.in ను ఓపెన్ చేయండి.
*మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి: రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి, ‘జనరేట్ OTP’ బటన్ పై క్లిక్ చేయండి.
*OTP ఎంటర్ చేయండి: మీ మొబైల్ నంబర్కు వచ్చిన OTPను సైట్ లో ఎంటర్ చేసి, ‘లాగిన్’ క్లిక్ చేయండి.
*స్టేటస్ చెక్ చేయండి: లాగిన్ అయిన తర్వాత, రైతు భరోసా దరఖాస్తు స్టేటస్, చెల్లింపు స్థితి, ఇతర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.