తెలంగాణ రైతులకు మరో శుభవార్త. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేశారు. పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా నిధులు కూడా త్వరలో అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు టాక్. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రతి 10 రోజులకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల చొప్పున రైతుల బీమా సొమ్ము జమ చేయాలని యోచిస్తున్నారు. కేవలం 45 రోజుల్లోనే కనీసం రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.