– 6 వేల కోట్లు దారిమళ్లింపు
– ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని నల్లగొండ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పొంగులేటి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉందని విమర్శించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు. అసైన్డ్ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరామన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరామని చెప్పారు. మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు.