ఆగస్టు 27న స్కూళ్లకు రావాలా.. వద్దా
విద్యా శాఖ తాజా ఉత్తర్వుల వర్తింపుపై స్పష్టత కరువు
హైదరాబాద్ః రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి 2020-21 అకడమిక్ ఇయర్ ప్రారంభోత్సవానికి విద్యాశాఖ సమాయత్తం అవుతున్న తరుణంలో విద్యా వాలంటీర్లు, పీటీఐలు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన పిలుపు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో 12600 మంది విద్యా వాలంటీర్లు, 2800 పీటీఐలు విధులు నిర్వహించినట్లు విద్యాశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వీరికి ఈ సంవత్సరం కూడా రెన్యువల్ చేయాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. కానీ ఆగస్టు 27 నుంచి గవర్నమెంట్ టీచర్లు విధిగా స్కూళ్లకు హాజరై ఆన్‌లైన్ బోధనకు వీలుగా డిజిటల్ కంటెంట్(ఈ-కంటెంట్)ను తయారులో పాల్గొనాలని విద్యాశాఖ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఇందులో విద్యా వాలంటీర్లు, పీటీఐలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలను పేర్కొనలేదు. తాజా ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ టీచర్లకు మాత్రమే వర్తిస్తాయని టీచర్స్ యూనియన్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం లేట్ అయినందున ఉపాధి కరువై తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినట్లు ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న విద్యావాలంటీర్లు, పీటీఐలు వాపోతున్నారు. విద్యావాలంటీర్లలో పులవురికి డిజిటల్ క్లాస్‌ల తయారీలో అనుభవం ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా వీరి సర్వీస్ రెన్యువల్‌పై దృష్టిసారించాలని విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.