మనం వాడే స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే మనల్ని ఏమార్చి కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిచోటా మాటు వేసి ఉంటున్నారు.
వీరు చేసే మోసాల గురించి అవగాహన కలిగి ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే వారికి అడ్డుకట్ట వేయగలమని రిజర్వు బ్యాంక్ అధికారులు అంటున్నారు.
పాస్‌వర్డ్‌లు బలంగా పెట్టుకోకపోయినా, వారి మాయమాటలకు పడిపోయినా ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు.
మన అలసత్వం, అమయాకత్వాన్నే ఆసరాగా చేసుకొని కూర్చున్నచోటి నుంచే కోట్ల రూపాయలు కొల్లగొడుగున్నారు సైబర్ నేరగాళ్లు.
వీరి బారి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు సూచిస్తూ ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది.
ఈ కనీస విషయాలు తెలిసి ఉండాలి
- ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు సెక్యూర్ పేమెంట్ గేట్‌వేస్‌ను ఎంచుకోవాలి. https://-URL తో పాటు దానికి లాక్ సింబల్ ఉంటేనే అది సరైందని గుర్తించాలి. లేదంటే మన సమాచారం మూడో వ్యక్తికి చేరే ప్రమాదం ఉన్నట్టే.
- మీ పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు, క్రెడిట్, డెబిట్‌కార్డుల నంబర్లు, సీవీవీ నంబర్లు భద్రంగా ఉంచుకోవాలి.
- మీ బ్యాంకు ఖాతాల వివరాలు..క్రెడిట్, డెబిట్‌కార్డుల నంబర్లు సహా ఇతర వివరాలు ఎప్పుడూ మీ ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, వెబ్‌సైట్స్‌లో సేవ్ చేసి పెట్టుకోవద్దు.
- మీకు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ఈ మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్లు, ఫైళ్లపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. వాటితో మీ కంప్యూటర్‌లోకి ఫిషింగ్ లింక్‌లు వచ్చే ప్రమాదం ఉంది.
- కొత్తవారితో మీ చెక్‌బుక్ కాపీలు, కేవైసీ డాక్యుమెంట్లు షేర్ చేయవద్దు.
- డివైజ్ లేదా కంప్యూటర్ సెక్యురిటీ ఇలా..
- తరచూ మీ పాస్‌వర్డ్‌లు మారుస్తూ ఉండాలి.
- మీ డివైజ్‌ల్లో మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవడంతోపాటు తరచూ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోవాలి.
- మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లకు తప్పక పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. మనకు తెలియని సోర్స్‌ల నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు.
మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి..
మనం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఇందుకోసం ‘https:// cybercrime.gov.in’ లో ఫిర్యాదు చేయవచ్చు.
అదేవిధంగా 24 గంటలపాటు పనిచేసే సైబర్‌క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 155260కు ఫిర్యాదు చేయవచ్చు.
మన తెలుగు రాష్ర్టాలతో సహా ఇతర రాష్ర్టాల్లోనూ ఈ హెల్ప్‌లైన్ సేవలు ఉంటాయి.
మనం కాల్ చేసిన వెంటనే పోలీసులు మన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేస్తారు.
దీనివల్ల మరింత సొమ్ము మనఖాతా నుంచి పోకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కేసు దర్యాప్తు ఉంటుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు వర్చువల్ కీబోర్డు (కంప్యూటర్ స్క్రీన్‌పైన కీబోర్డు కనిపిస్తుంది)ను వాడాలి.
- సాధారణ కీబోర్డుపై మనం ఏయే నంబర్లు నొక్కామన్నది ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది..
- మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసిన వెంటనే లాగ్‌అవుట్ కావాలి.
- తరచూ మీ పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండాలి.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు..మీ ఈమెయిల్‌కు ఒకే పాస్‌వర్డ్‌ను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకోవద్దు.
- సైబర్ కేఫ్‌లు, ఇతర పబ్లిక్ కంప్యూటర్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయకపోవడం ఉత్తమం.
పాస్‌వర్డ్ పక్కాగా ఉండేలా చూసుకోవాలి..
మీ పాస్‌వర్డ్ మీ ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలకు, సోషల్ మీడియా ఖాతాలకు తాళం వంటిది. ఇది పక్కాగా ఉండేలా చూసుకోవాలి.
అవకాశం ఉన్న ప్రతి చోటా టూ ఫ్యాక్టర్(రెండంచెల సెక్యూరిటీ) ఆథంటికేషన్ పెట్టుకోవాలి.