– కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్, టాస్క్-ఆధారిత పార్ట్‌టైం జాబ్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా మోసాలకు కారణమవుతున్న వెబ్‌సైట్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు దాదాపు 100కు పైగా వెబ్‌సైట్లను కేంద్ర ఐటీ శాఖ బ్లాక్ చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇల్లీగల్ ఇన్వెస్ట్ మెంట్స్, పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) విభాగం ఇటీవల పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ తరహా మోసాలు జరుగుతున్న కొన్ని వెబ్‌సైట్లను గుర్తించి.. వాటిని తక్షణమే బ్లాక్ చేయాలని ఐటీ శాఖకు సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ శాఖ తమ ప్రత్యేక అధికారాలతో 100కి పైగా వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ వెబ్‌సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు ఐటీశాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్స్, రెంటెడ్ అకౌంట్లను వినియోగించి వీరు తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తెలిపింది. ఇలా ఆర్థిక మోసాల నుంచి వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీలు, విదేశీ ఏటీఎం కార్డులు, ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ కంపెనీల సాయంతో మనీలాండరింగ్ చేస్తున్నారని తాము గుర్తించినట్లు ఐటీశాఖ పేర్కొంది. అయితే, ఈ వెబ్‌సైట్ల వివరాలను కేంద్రం వెల్లడించలేదు.
పార్ట్ టైమ్ జాబ్ మోసాలపై అలర్ట్‌గా ఉండాలి
ఈ సందర్భంగా పార్ట్‌టైం జాబ్ మోసాలపై కేంద్రం హెచ్చరికలు చేసింది. ‘ఇంట్లోనే కూర్చుని సంపాదన’ వంటి ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు యూజర్లను ఆకట్టుకుంటారని పేర్కొంది. రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులను ఎక్కువగా టార్గెట్ చేస్తారని తెలిపింది. ‘అలాంటి యాడ్స్ క్లిక్ చేయగానే.. వారి ఏజెంట్లు వాట్సప్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల్లో యూజర్లతో మాట్లాడుతారు. వీడియోలు లైక్ చేయడం, సబ్‌స్క్రైబ్ చేయడం, రేటింగ్ ఇవ్వడం వంటి టాస్క్‌లు చేసి ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించొచ్చు అంటూ యూజర్లను వలలో వేసుకుంటారు. తొలుత కొంత కమిషన్ ఇచ్చి.. ఆ తర్వాత లాభాల ఆశజూపి పెట్టుబడి మోసాలకు పాల్పడుతారు’అని కేంద్రం తెలిపింది. ఇలాంటి మోసాల పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించింది. ఇటీవల మహాదేవ్ బెట్టింగ్ యాప్ వివాదం నేపథ్యంలో అక్రమంగా బెట్టింగ్‌కు పాల్పడే 22 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిలో మహదేవ్, రెడ్డీఅన్నప్రెస్టోప్రో వంటి యాప్‌లు ఉన్నాయి.