– వెల్లడించిన అధికారిక వర్గాలు
– కలర్ స్మోక్ ఘటనపై ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై లోక్‌సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన..
లోక్‌సభలో బుధవారం చోటుచేసుకున్న ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. వారి ఆందోళనల మధ్య సభ కొంతసేపు సాగింది. అయితే, విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ వారిని వారించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దీనిపై స్పీకర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. పాస్‌లు ఇచ్చే విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం’అని వెల్లడించారు.
బూట్లను కూడా స్కాన్..
తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ భవనంలోకి ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే డోర్ నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. మీడియాపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించి మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు. ఇక పార్లమెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి బూట్లను కూడా స్కాన్ చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.