Homeతెలంగాణsentiment:‘సెంటిమెంట్’​ రగులుతోంది

sentiment:‘సెంటిమెంట్’​ రగులుతోంది

– కాంగ్రెస్​, బీజేపీకి పొంచి ఉన్న ముప్పు
– షర్మిల రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజం
– కాషాయపార్టీతో పొత్తుకు చంద్రబాబు వ్యూహాలు
– 2018 నాటి సీన్​ రిపీట్​ అయ్యే చాన్స్​
– కాంగ్రెస్​, బీజేపీ నేతల్లో అంతర్మథనం స్టార్ట్​
– బీఆర్ఎస్​కు అనుకూల వాతావరణం
– చంద్రబాబుతో కలిస్తే కాషాయపార్టీ సీట్లు గోవిందా..
– షర్మిలను చేర్చుకుంటే కాంగ్రెస్​ ఓట్లు ఖతమ్​..
– లోకల్​ లీడర్స్​ వ్యతిరేకిస్తున్నా.. అధిష్ఠానం సమ్మతి
– తెలంగాణలో ఉద్యమకాలంనాటి పరిస్థితి
– బీఆర్ఎస్​ అధినేతకు అస్త్రాలనందిస్తున్న విపక్షాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితి ఉపిరిపోసుకుంటున్నది. సెంటిమెంట్​ రగులుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రం సాకారమై పదేండ్లు పూర్తయ్యింది కాబట్టి.. ప్రస్తుతం సెంటిమెంట్​ ఉండదని అంతా భావిస్తున్నారు. కానీ మళ్లీ ఉద్యమనాటి రోజులు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఆంధ్రామూలాలున్న లీడర్లు ఇక్కడ రాజకీయంగా యాక్టివ్​ కావడమే. ఇటీవల వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కేవీపీ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్​ పెట్టారు. దీంతో మొదటికే మోసం వచ్చి ఇక్కడ కాంగ్రెస్​, బీజేపీ ఘోరంగా దెబ్బతినబోతున్నాయి. 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్​ బలంగా పనిచేసింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల నాటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే తొలుత ఎజెండాగా పనిచేశాయి. కానీ ఎప్పుడయితే చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చారో.. మళ్లీ ఉద్యమం నాటి రోజులు కనిపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఉద్యమానికి అడ్డంపడ్డ విలన్​ గానే చూశారు. అందుకే అప్పుడు కాంగ్రెస్​ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ చావుదెబ్బ తిన్నది. దాదాపుగా 30 స్థానాలు కాంగ్రెస్​ పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు వల్లే పోగోట్టుకున్నదని.. ఆ పార్టీ లీడర్లు అంతర్గతంగా చర్చించుకుంటారు. తాము చంద్రబాబు వల్ల నష్టపోయాయని కొందరు లీడర్లు బహిరంగంగా ఒప్పుకున్నారు కూడా. అయితే ప్రస్తుతం చంద్రబాబు మరోసారి తెలంగాణ గడ్డ మీద కాలుమోపేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ పార్టీతో జతకడితే.. ఈ సారి మాత్రం.. బీజేపీతో దోస్తీ చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్​ నష్టపోయింది. ఈ సారి బీజేపీ నష్టపోకతప్పదన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సారి కాంగ్రెస్​ పార్టీకి మరో గట్టి దెబ్బ తగలనున్నది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల రూపంలో ఆ పార్టీకి పెను ప్రమాదం పొంచి ఉంది. షర్మిలను తెలంగాణ సమాజం ఇప్పటికీ శత్రువుగానే చూస్తున్నది. అందుకు ప్రధాన కారణం ఆమె రాజశేఖర్​ రెడ్డి బిడ్డ కావడమే. రాజశేఖర్​ రెడ్డి ఎంత గొప్పనాయకుడు అయినప్పటికీ.. ఎన్ని సంక్షేమపథకాలు తీసుకొచ్చినప్పటికీ తెలంగాణ విషయంలో ఆయన వైఖరిని మాత్రం ఇక్కడి ప్రజలు ఎప్పటికీ జీర్ణించుకోలేరు. ఇదే రాజశేఖర్​ రెడ్డి బిడ్డగా షర్మిలకు కూడా నష్టం తెచ్చిపెట్టింది.

షర్మిలతో కాంగ్రెస్​ పార్టీకి పూడ్చుకోలేని నష్టం..
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల.. రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా తెలంగాణలో కాలు మోపింది. తన తండ్రి మీదున్న అభిమానం, క్రైస్తవ సామాజికవర్గ ఓట్లు తనకు కలిసి వస్తాయని ఆమె భావించారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3,600 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ను టార్గెట్​ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కడా కూడా ఆమెకు జనం నుంచి ఆదరణ దక్కలేదు. పైగా వ్యతిరేకత వచ్చింది. ఆమెను తెలంగాణ సమాజం రాజశేఖర్ రెడ్డి కూతురుగా, ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడటమే అందుకు కారణం. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేనని భావించిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్​ లో విలీనం చేసి.. ఎక్కడైనా పోటీ చేద్దామని భావిస్తున్నారు. లోకల్​ లీడర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. అధిష్ఠానం మాత్రం ఆమె విషయంలో కొంత సాఫ్ట్​ కార్నర్​ ప్రదర్శిస్తోంది. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించగా.. కోమటిరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క ఆమె రాకను స్వాగతించారు. అందుకు కారణం రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె గలమెత్తడమే. అందుకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత, గ్రూపు రాజకీయాలు కూడా ఓ కారణం. ఏది ఏమైనా షర్మిల వస్తే తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ చావుదెబ్బ తినకమానదన్న విశ్లేషణలు ఉన్నాయి.

చంద్రబాబు మార్కు రాజకీయం రిపీట్​..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రం మీద ఆశ చావడం లేదు. ఇక్కడ ఆ పార్టీకి కొంతమేర కేడర్​ ఉండటం ఓ కారణం. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్​ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. సెటిలర్ల ఓటర్లు, టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్​ భావించింది. కానీ కాంగ్రెస్​ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. చంద్రబాబు రావడంతో దాదాపు 30 సెగ్మెంట్లలో కాంగ్రెస్ దెబ్బతిన్నది. అంతేకాక సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్​ విజయఢంకా మోగించింది. దీంతో చంద్రబాబు రాకతో నష్టమే తప్ప లాభం లేదని తేలిపోయింది. అయితే మళ్లీ చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద దృష్టి పెట్టారు. ఈ సారి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. జాతీయస్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు కాబట్టి.. రాష్ట్రస్థాయిలోనూ ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సెటిలర్లు ఓట్లు బీజేపీ వైపు మళ్లుతాయని ఆయన అనుయాయులు బీజేపీ హైకమాండ్ కు నివేదికలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా లోకల్​ లీడర్స్​ చంద్రబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే. షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరితే మరోసారి తెలంగాణలో సెంటిమెంట్ రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్​కు కొత్త తలనొప్పిగా కేవీపీ
షర్మిల వస్తేనే తీవ్రంగా నష్టపోతాం. ఆ లోటును ఎలా భర్తీ చేసుకోవాలి. ఆమె రాకను ఏ విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్​ లీడర్లు తలలు పట్టుకుంటుంటే వాళ్లకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. షర్మిలకు తోడు మరో సీమాంధ్ర నేత తాను తెలంగాణ వాడినని ప్రకటించుకుంటున్నారు. ఇటీవల వైఎస్సార్​ ఆత్మగా పేరు తెచ్చుకున్న కేవీపీ మాట్లాడుతూ.. తాను తెలంగాణ వాడినేనని చెప్పారు. దీంతో కేవీపీ సైతం టీ కాంగ్రెస్​ లో చొరబడితే ఉద్యమ కాలం నాటి రోజలు రిపీట్​ అయ్యి కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఏర్పాటును కేవీపీ ఎంతో తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటులో రోజుల తరబడి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ విషయాన్ని అంత తేలికగా తెలంగాణ సమాజం మరిచిపోయే పరిస్థితుల్లో లేదు. మరి కేవీపీ కూడా ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాభవం తప్పదు.

బీఆర్ఎస్​ జాతీయ పార్టీ కదా.. సెంటిమెంట్​ ఇప్పుడేంటి?
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించినా.. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నది కాబట్టి.. ఇతర రాష్ట్రాల నేతలు ఇక్కడికి వస్తే బీఆర్ఎస్​ నేతలు ఎలా అడ్డుకుంటారు? అని కొందరు అంటున్నారు. అయితే బీఆర్ఎస్​ జాతీయ పార్టీ అయినా.. కేసీఆర్​ జాతీయ స్థాయి నేత అయినా ఆయనను తెలంగాణ సమాజం తమవాడిగానే గుర్తిస్తుంది. కేసీఆర్​ ఇతర రాష్ట్రాల్లో వెళ్లి రాజకీయం చేస్తే అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తారేమో గానీ తెలంగాణ సమాజం దాన్ని అంగీకరిస్తుంది. కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లు ఇక్కడికి వస్తే కచ్చితంగా సెంటిమెంట్ రగిలే చాన్స్​ ఉంది. మొత్తంగా ఎన్నికల వేళ జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్​ పార్టీకి మేలు చేసేలా ఉన్నాయి. మరి తెలంగాణ సెంటిమెంట్​ రాజుకోకుండా కాంగ్రెస్​, బీజేపీ ఎటువంటి ప్రణాళికలు రచిస్తాయో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img