- పది రోజుల వ్యవధిలో మరో సంఘటనతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు
- విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి మళ్ళీ కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఆరవ తరగతికి చెందిన అనిరుద్ ను జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినట్లు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హేమంత్ అనే విద్యార్థిని మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో విద్యార్థి మొండి మోక్షిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కావడంతో భయాందోళనకు గురవుతున్నారు.
విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.