Service charge : ఇక హోటల్స్, రెస్టారెంట్స్ సర్వీస్ ఛార్జ్ బాదుడుపై బ్యాన్
Service charge in restaurant : హోటల్, రెస్టారెంట్ బిల్‌లో సర్వీస్ ఛార్జ్ చూసి షాకయ్యారా? ఎందుకు కట్టాలని అక్కడి సిబ్బందితో వాదించి విసుగెత్తిపోయారా? చివరకు చేసేదేమీ లేక వారు చెప్పినంత బిల్ చెల్లించి వచ్చేశారా? ఇకపై అలా కుదరదు.
కొత్త రూల్స్ ప్రకారం.. సర్వీస్ ఛార్జ్ విధించడం నిషిద్ధం.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేయాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చదవండి.
హోటల్స్, రెస్టారెంట్స్‌లో సర్వీస్ ఛార్జ్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించేలా కీలక ఆదేశాలు వెలువడ్డాయి.
బిల్‌లో ఆటోమెటిక్‌గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధించింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ).
నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్ అందుబాటులోకి తెచ్చింది.
సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది.
హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది.
కొత్త నిబంధనల ప్రకారం…
హోటల్స్ లేదా రెస్టారెంట్స్.. బిల్‌లో సర్వీస్ ఛార్జ్‌ను ఆటోమెటిక్‌గా యాడ్ చేయకూడదు.
ఇతర పేర్లతో సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదు.
సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని వినియోగదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి చేయరాదు. సేవా రుసుము చెల్లింపు.. పూర్తిగా ఐచ్ఛికమని వారికి స్పష్టంగా చెప్పాలి.
సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తారా లేదా అనే విషయం ఆధారంగా వినియోగదారులను హోటల్ లేదా రెస్టారెంట్ లోపలకు అనుమతించడం, లేదా వారికి అందించే సేవలపై ఆంక్షలు విధించడం చేయకూడదు.
ఫుడ్ బిల్తోపాటే సర్వీస్ ఛార్జ్ కూడా విధించి.. ఆ మొత్తంపై జీఎస్టీ వసూలు చేయడం నిషిద్ధం.
నిబంధనలు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ విధించిందని కస్టమర్ భావిస్తే.. బిల్ నుంచి ఆ అదనపు మొత్తాన్ని తొలగించాలని అక్కడి యాజమాన్యాన్ని అడగొచ్చు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కస్టమర్లు 1915 నంబర్‌కు కాల్ చేసి లేదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్(ఎన్సీహెచ్) యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
సర్వీస్ ఛార్జ్ విషయమై కస్టమర్లు వినియోగదారుల కమిషన్‌కూ ఫిర్యాదు చేయవచ్చు.