Shakti Dubey : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు (ఏప్రిల్ 22) UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.ఇందులో శక్తి దూబే అనే మహిళా అభ్యర్థి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
శక్తి దూబే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 (AIR 1) సాధించిన అగ్రస్థాన టాపర్. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆమె ఏడు సంవత్సరాల కష్టంతో ఈ అసాధారణ విజయాన్ని సాధించింది. ఆమె అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బయోకెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc.) పూర్తి చేసి, ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) నుండి బయోకెమిస్ట్రీలో ఎమ్.ఎస్సీ పట్టా పొందింది.
తన విద్యా నేపథ్యం సైన్స్‌లో ఉన్నప్పటికీ.. UPSC పరీక్ష కోసం పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఆమె ఎంచుకుంది. ఆమె తన తండ్రి పోలీసు సర్వీసులో ఉండటం వల్ల ప్రజా సేవలో చేరాలనే ప్రేరణ పొందింది. అందుకే 2018లో ఐఏఎస్ కావాలి అనుకుంది. సివిల్ సర్వీసెస్ కోసం శక్తి సన్నాహాలు ఏడు సంవత్సరాలు కొనసాగాయి. ఆమె కష్టానికి ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె విజయం ముఖ్యంగా చిన్న పట్టణాల నుండి వచ్చే UPSC ఆకాంక్షులకు ఒక స్ఫూర్తిదాయక కథగా నిలుస్తుంది. శక్తి దూబే ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరి, మస్సూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో శిక్షణ పొందనున్నారు.