- ముగిసిన డెడ్ లైన్
- రాజకీయ భవితవ్యంపై నో క్లారిటీ
- శ్రేణుల్లో కొనసాగుతున్న సస్పెన్స్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇంకా డైలమాలో ఉన్నారని తెలుస్తోంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని గతంలో జోరుగా ప్రచారం సాగింది. షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా , రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే విలీనంపై కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ.. వైఎస్సార్టీపీ నుంచి ఎటువంటి క్లారిటీరాలేదు. దీంతో ఇటీవల వైఎస్సార్టీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయిన షర్మిల డిసెంబర్ 30 వరకు కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించామని.. ఆ తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే నేటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటవంటి ప్రతిపాదన రాలేదని తెలిసింది. దీంతో షర్మిల ప్రస్తుతం డైలమాలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
షర్మిల రాకను కాంగ్రెస్ ఓ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వైఎస్సార్టీపీ.. కాంగ్రెస్ పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనంచేస్తారా? లేక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా పోటీ చేయబోతున్నదా? అన్న విషయం సస్పెన్స్ గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయాలని భావించారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, వరుస పర్యటనలు చేశారు. తనతో పాటు మరో ఐదు లేదా ఆరుమందికి కీలక నేతలకు భాగంగా టికెట్లు ఇవ్వాలని షర్మిల కోరారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. పాలేరు లేదా సికింద్రాబాద్ ఏదో ఓ సెగ్మెంట్ ను ఆమె ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. దీంతో షర్మిల ఇంకా డైలమాలోనే ఉన్నట్టు టాక్. మరి షర్మిల ఏం చేయబోతున్నారో.. వేచి చూడాలి.