నేటి నుంచి మొదలయ్యే శ్రావణమాసం సెప్టెంబర్ 3తో ముగియనుంది. ఈ నెల 31లోపే శుభకార్యాలను ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు. ఈ నెల 28 వరకే శుభముహూర్తాలున్నాయి.అయితే శ్రావణమాసంలో వచ్చే పండుగలిలా ఉన్నాయి. సోమవారం (ఈనెల 5) నుంచే శ్రావణం మొదలవుతోంది. 8న నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఈనెల 5న తొలి సోమవారంతో పాటు 12, 19, 26న సోమవారాల్లో శివుడిని, 9, 16, 23, 30వ తేదీల్లో (శుక్రవారాల్లో) లక్ష్మీదేవి, 10, 17, 24, 31వ తేదీల్లో (శనివారాల్లో) విష్ణువును పూజిస్తారు.
వివాహాలకు శుభ ముహూర్తాలు ఇవే
శ్రావణ మాసం వచ్చేసింది. దీంతో గత మూడు నెలలుగా ఉన్న మూఢం పోవడంతో శుభ కార్యాలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 7 నుంచి 28 వరకు వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఆగస్టు 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలలో శుభకార్యాలు చేపట్టుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక 17, 18 తేదీలు అత్యంత శుభ ముహూర్తాలని పండితులు వెల్లడించారు.