- తెలంగాణలోని 600 అగ్రోస్ కేంద్రాలలో లభిస్తుంది
- సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులను చైతన్యం చేయాలి
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ః పంటల అధిక ఉత్పత్తి పేరుతో రైతులకు రసాయనిక ఎరువులను అలవాటు చేశారని, దీంతో రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని విస్మరించారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ‘తెలంగాణ సిరి సిటీ కంపోస్ట్’ సేంద్రీయ ఎరువులను మార్కెట్లోకి ఆయన విడుదల చేశారు. సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ‘తెలంగాణ సిరి’ సేంద్రీయ ఎరువులను రైతులు ఆదరించాలని రైతులకు విజ్ఙప్తి చేశారు. రసాయనాల వాడకం అధికం కావడంతో గత ఏడాది 8.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా వినియోగించగా ఈ ఏడాది 10.5 లక్షల మెట్రిక్ టన్నులు సరిపోయేలా లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఈ ఏడాది దాదాపు 12 లక్షల ఎకరాలలో పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి సాగుచేయించామన్నారు. ఇక ఏడాదికి రెండుసార్లు భూసార పరీక్షలు .. రైతుల పొలాలకు సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. జర్మనీలో సర్కారు సూచన మేరకు ఎరువులు వాడిన రైతులకు ఏడాదికి 2500 యూరోలు నజరానా ఇస్తుంది .. మోతాదు మించితే పది రెట్ల జరిమానా వసూలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, అగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు.