ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, నామాపూర్ గ్రామంలో వృద్ధ దంపతులు దండ్ల లక్ష్మి, దండ్ల లక్ష్మయ్య నివాసం ఉండగా ఇటీవల ఈదురు గాలుల వర్ష బీభత్సానికి ఇల్లు కుప్పకూలింది. ఈ వృద్ధ దంపతులు కవర్ కప్పుకొని కాలమెల్ల తీస్తున్నారు. అయితే అదే ఇంటి స్థలంలో రేకుల ఇల్లు నిర్మించుకుందామని పని ప్రారంభిస్తే గ్రామపంచాయతీ అధికారులు ప్రభుత్వ భూమి రోడ్డుకే వెళుతుంది ఈ స్థలంలో ఇల్లు నిర్మించుకోరాదని అధికారులు తెలిపారు. దీంతో ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు అవుతూ మీడియా ముందుకు వచ్చి తమ గోడును విన్నవించుకున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఇదే ఇంటి స్థలంలో నివాసం ఉంటున్నామని ఇటీవల వర్ష బీభత్సానికి ఇల్లు కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ముగ్గురు కుమారులు.. బతుకుదెరువు కోసం అక్కడక్కడ బతుకుతున్నారు. మేము ఇక్కడనే ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ద్వారా బతుకుతున్నామని, గుంటెడు భూమి జాగా మాకు లేదని ఆ వృద్ధులు కన్నీటి పర్వతమయ్యారు. మాకు రేకుల షెడ్డు వేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.