స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అచ్చెన్నాయుడుకి భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అచ్చెన్నాయుడుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీనీ హైకోర్టు ఆదేశించింది. ఇక తన తదుపరి విచారణను ఏప్రిల్ 02, 2024కి వాయిదా వేసింది కోర్టు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లో.. యువత ఉపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ మేరకు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిమెన్స్ ఇండియాతో ఎంఓయూ ఒప్పందాన్ని చేసుకుంది అప్పటి టిడిపి ప్రభుత్వం. ఇందులో 10 శాతం ఖర్చును ప్రభుత్వం పెట్టుకుంటే.. 90 శాతం ఖర్చు సీమెన్స్ గ్రాంట్ గా ఇవ్వాలన్నది ఒప్పందం సారాశం. 2015లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను స్థాపించారు. రూ.3,356 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి 2021లో జరిగిన ఏపీ అసెంబ్లీలో పెద్ద స్కామ్ గా అభివర్ణించారు.