- గూడూరు మండల కేంద్రం పరిధిలోని గ్రామాలలో పనిచేయని సీసీ కెమెరాలు
- ప్రధాన కూడళ్లు, రోడ్ల వెంట నిరుపయోగంగా ఉన్న వైనం.. పట్టించుకోని సంబంధిత అధికారులు
ఇదే నిజం, గూడూరు: ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రతి క్షణాన్ని వీడియోలు నిక్షిప్తం చేసేలా ఏర్పాట్లుంటే, ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడైనా విశ్లేషించడం సులబతరం అవుతుంది. పోలీసు విచారణకు సీసీ ఫుటేజీలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రభుత్వం ప్రోత్సాహంతో, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో, పల్లె, పట్టణాలలో సీసీ. కెమెరాల వాడకం సర్వసాధారణంగా మారింది. కొన్ని చోట్ల దాతల సహకారంతో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మండలంలో దాతలు, ప్రజాప్రతినిధుల విరాళాలతో, ఏర్పాటు చేసిన సీసీ. కెమెరాలు మూలకు పడ్డాయి. చౌరస్తాలు, పట్టణ, గ్రామ, ముఖ ద్వారాలు, రద్దీ ప్రదేశాలలో రోడ్లపై విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణను గాలికి వదిలేయడం తో, సాయం చేసిన దాతల ప్రయత్నం, డబ్బు బూడిదలో పోసిన పన్నీరయ్యింది. నేరాల అదుపునకు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రజలందరూ ప్రోత్సహించారు. ఒక్క సీసీ. కెమెరా, వందమంది పోలీస్ అధికారులతో సమానమని, ప్రజల్లో అవగాహన కల్పించి. నివాసాలు, వ్యాపార కేంద్రాలలో సీసీ. కెమెరాలు ఏర్పాటు చేయించిన, నిర్వహణ లేక ఫలితం లేకుండా పోతుంది.
పనిచేయని మూడో కన్ను
గూడూరు మండల కేంద్రంతో పాటుగా, అయోధ్యాపురం గ్రామంలోను, సీసీ కెమెరాలు నామ మాత్రంగానే ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు పనిచేయడం లేదు. గూడూరు మండల కేంద్రంలో జూన్ నెల 2024, ఈ సంవత్సరంలోనే స్థానిక పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిఐ. కె. బాబురావు గన్ మెన్ గా, విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ దనసరి పాపారావు, కొంగరగిద్ద వాస్తవ్యులు. అదేవిధంగా మచ్చర్ల గ్రామానికి చెందిన చుంచా దేవేందర్, సిఆర్ టీ. టీచర్ గా ములుగు జిల్లా, రామన్నగూడెం గ్రామంలో విధులకు బయలుదేరుతున్న తరుణంలో, భద్రాచలం కొత్తగూడెం జిల్లా నుండి మహారాష్ట్ర లోని, ఒడిసాకు జమాయిల్ కర్రతో హెవీ లోడ్ తో బయలుదేరినా లారీ, గూడూరు బస్టాండ్ సమీపంలోని మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో, రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ యాక్సిడెంట్ జరిగిన వివరాలను క్రాంతి కూల్ డ్రింక్స్ యజమాని ఏర్పాటు చేసిన, సీసీ కెమెరాల సహాయంతో మాత్రమే, ప్రమాదానికి గల కారణాలను కనుగొన్నారు. అదేవిధంగా ఈనెల ఆగస్టు 6వ, తారీకు మంగళవారం ఉదయం గంటలు 9:40 నిమిషములకు, గూడూరు మండల కేంద్రం పరిధిలోని మరిమిట్ట గ్రామంలోని, ధనసరి వెంకన్న అనే రైతు, తన వ్యవసాయ భావి వద్దకు ప్రతిరోజులాగానే, సైకిల్ పై బయలుదేరి పోతున్న క్రమంలో, మహబూబాబాద్ నుండి నర్సంపేట వైపు వెళుతున్న కారు వెనుక నుండి సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి, కారును ఆపకుండా ఒక నిండు ప్రాణాన్ని బలిగొని, స్వేచ్ఛగా ఏ సాక్షాధారాలు లేకుండా పారిపోగలిగాడు . అదే సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే, నేడు నిండు ప్రాణాన్ని బలిగొన్న వాహనదారున్ని పోలీసులు క్షణాలలో, సీసీ కెమెరాల లో నిక్షిప్తమైన ఆధారాలతో, అరెస్టు చేయడం ఎంతో సులువు అయ్యేది. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబానికి జరిగిన నష్టానికి, కనీసం పరిహారమైన అందేది. కాలం చెల్లిన సీసీ కెమెరాలను గూడూరు మండల కేంద్రంలో ఇప్పటికైనా మార్చి, కొత్తవి సీసీ కెమెరాలను అమర్చాలి. కొత్త సీసీ కెమెరాలను అమర్చడంలో మండలంలోని స్థానిక తహసీల్దార్, మండల అభివృద్ధి ఉన్నతాధికారులతో పాటు, పోలీస్ అధికారులు చొరవ తీసుకుంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇప్పటికైనా సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని మండల ప్రజలు, అధికారుల యంత్రాంగాన్ని కోరుతున్నారు.