Homeరాజకీయాలునోరు జారే చిన్న బాస్​

నోరు జారే చిన్న బాస్​

– ఎన్నికల వేళ టంగ్​ స్లిప్​
– కాంట్రవర్సీ స్టేట్​మెంట్స్ తో గందరగోళం​
– చంద్రబాబు అరెస్ట్​పై చేసిన కామెంట్లు బూమరాంగ్​
– సెటిలర్లు బీఆర్ఎస్​ పార్టీకి దూరమయ్యే పరిస్థితి
– డీకే ఫాక్స్​ కాన్ కు లేఖ రాశారంటూ ఆరోపణ
– తర్వాత నిర్ధారించుకోలేదని సవరణ
– రైతుబంధు విషయంలో కాంట్రవర్సీ కామెంట్స్​
– కేసీఆర్​ ఒకలా.. కేటీఆర్​ మరోలా
– ఇందిరా, ఎన్టీఆర్​ కూడా ఓడిపోయారంటూ నైరాశ్యం
– కేడర్​లో తీవ్ర నిరుత్సాహం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల వేళ కేటీఆర్​ రాజకీయ ప్రకటనలు పార్టీకి నష్టం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చేసిన కామెంట్లు వరసగా బూమరాంగ్​ అవుతుండటంతో కేడర్​ కన్ఫ్యూజన్​లో పడిపోతున్నది. ఇటీవల ఫ్యాక్స్​ కాన్​ కంపెనీని తరలించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ కుట్రలు చేస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఫ్యాక్స్​ కాన్​ కంపెనీకి రాసిన ఓ లేఖను కూడా బయటపెట్టారు. బీఆర్ఎస్​ శ్రేణులు ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ లెటర్​ ఫేక్ అని డీకే వివరణ ఇచ్చుకున్నారు. కర్ణాటకలో కేటీఆర్​ మీద కేసు కూడా నమోదు చేశారు. దీంతో లెటర్​ విషయంలో గందరగోళం నెలకొన్నది. కాగా ఈ లెటర్​ వివాదంపై ఇటీవల కేటీఆర్​ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను లెటర్​ విషయంలో కన్​ ఫార్మ్​ చేసుకోకుండా మాట్లాడానని ఒప్పుకున్నారు. దీంతో ఈ లెటర్​ అంశం బూమరాంగ్ అయ్యింది.

విశ్వసనీయత మీద దెబ్బ


ఏ పొలిటికల్​ లీడర్​ కయినా విశ్వసనీయత ఎంతో ముఖ్యం. విశ్వసనీయత వల్ల నేతలు ప్రజల మనసులను చూరగొంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కేటీఆర్​ చేసిన ప్రకటన ఆయన విశ్వసనీయత కోల్పోయేలా చేసింది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్​ శ్రేణులు ఈ లేఖ విషయంలో సైలెంట్​ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్​ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ హామీ కేసీఆర్​ మెడకు చుట్టుకున్నది. సందర్భం వచ్చిన ప్రతీసారి విపక్ష నేతలు ఈ హామీ విషయాన్నే ప్రస్తావిస్తూ ఉంటారు. తాజాగా కేటీఆర్​ విపక్షాలకు ఊతమిచ్చేలా టంగ్​ స్లిప్​ అవుతున్నారు.

కేటీఆర్​ వరస ఇంటర్వ్యూలు


ఇక ఎన్నికల వేళ కేటీఆర్​ వరస ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకుపోతున్నారు. కేటీఆర్​కు అనేక భాషల మీద పట్టు ఉండటంతో పదునైన సంభాషణలతో ఆకట్టుకుంటున్నారు. అయితే కేటీఆర్​ అప్పుడప్పుడూ చేసే కొన్ని కామెంట్లే వివాదాస్పదంగా మారుతున్నాయి. లౌక్యం తెలియక కేటీఆర్​ చేసే కామెంట్లు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని బీఆర్ఎస్​ కార్యకర్తలు లోలోపల మథనపడుతున్నారు.

ఇందిరా, ఎన్టీఆర్​ ఓడిపోలేదా?


ఇండియా టూడే ఇంటర్వ్యూలో కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. అయితే గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీఆర్​ సైతం ఓడిపోలేదా? అంటూ కేటీఆర్​ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. సహజంగా ఓడిపోయిన తర్వాత లీడర్లు ఇటువంటి ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ కేటీఆర్​ మాత్రం ఎన్నికల టైమ్​ లోనే ఇటువంటి కామెంట్లు చేయడంతో కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు ఉన్నాయి. ముఖ్యనేతే ఇలా మాట్లాడితే కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లిపోతారని కొందరు చర్చించుకుంటున్నారు.

‘రైతుబంధు’ విషయంలోనూ బ్యాక్ స్టెప్​


తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధులో ఎటువంటి యథాతథంగా రైతు బందు పథకాన్ని అమలు చేస్తానని కేసీఆర్​ ఇప్పటికీ ఎన్నో సభల్లో చెప్పారు. అయితే తాజాగా కేటీఆర్​ రైతు బంధును కేవలం మూడు లేదా నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉందని వ్యాఖ్యానించారు. పెద్ద రైతులకు ఎక్కువ మొత్తంలో నగదు వస్తుండటంతో చిన్న రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయని ఆయన అన్నారు. అయితే దీంతో రైతాంగం కూడా ఆలోచనలో పడింది. నిజానికి రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత సక్సెస్​ ఫుల్​ స్కీమ్​. నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డబ్బు పడుతోంది. ఈ స్కీమ్​ విషయంలోనూ కేటీఆర్​ కామెంట్లు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటివరకు రైతుల అకౌంట్లలో 75 వేల కోట్లు జమ చేశామని తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇక కాంగ్రెస్​ నేత ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మాత్రం రైతు బంధును దుబారాగా వర్ణించారు. ప్రస్తుతం కేటీఆర్​ వ్యాఖ్యలు ఉత్తమ్​ ను సమర్థించేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా కేటీఆర్​ ఇటీవల లౌక్యం ప్రదర్శించకుండా దూకుడుగా చేస్తున్న కామెంట్లు బీఆర్ఎస్​ పార్టీకి నష్టం తెచ్చిపెడుతున్నాయి.

Recent

- Advertisment -spot_img