ఎస్పీబీ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
హైదరాబాద్: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలోనే ఇలా జరగడం విచారకరం. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
తెలంగాణ సీఎం కేసీఆర్
ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు… భారతీయ ప్రజలందరికీ ఆత్మీయుడయ్యారు. వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం. బాలు లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
చిరంజీవి
ప్రపంచ సంగీతానికి ఇది చీకటి రోజు. మ్యూజిక్ లెజెండ్ ఎస్పీ బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నా కెరీర్ విజయంలో బాలు గారి స్వరం పాత్ర ఎంతో ఉంది. ఆయన నా కోసం ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. ఘంటసాల గారి తర్వాత ఈ సంగీత ప్రపంచాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారా?.. అనే తరుణంలో ఓ తారలా బాలు గారు మ్యూజిక్ గెలాక్సీలోకి అడుగుపెట్టారు. భాష, ప్రాంతం, హద్దులు.. అనేవి లేకుండా పలు దశాబ్దాలుగా ఆయన మధుర గాత్రం భారత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అలరిస్తోంది. భవిష్యత్‌లో మరో బాలసుబ్రమణ్యం రాడు.. కేవలం ఆయన పునఃజన్మ మాత్రమే ఆ లోటును భర్తీ చేయగలదు. ఆయన మరణ వార్త విని, నా గుండె పగిలింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.
రజనీకాంత్
బాలు సర్.. గత కొన్నేళ్లుగా మీరు నా స్వరం అయ్యారు. మీ జ్ఞాపకాలు, మీ స్వరం నాతో ఎప్పటికీ ఉంటాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా..
కె. రాఘవేంద్రరావు
నా ప్రియమైన బాలు.. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది.. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి.. రాగాలన్నీ మూగబోయాయి.. నువ్వు లేని లోటు తీర్చలేనిది..!!
ఎ.ఆర్. రెహమాన్
ఎస్పీ సర్ మీరు ఇకలేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నా గుండె ముక్కలైంది.


తమన్
నా కన్నీటిని ఆపుకోలేకపోతున్నా.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం. నా హృదయం బాధతో నిండిపోయింది.
నాగార్జున
బాలు గారితో ముచ్చట్లు, ఆయన జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చే సరికీ కన్నీరు ఆగడం లేదు. నా సినిమా ‘అన్నమయ్య’ విడుదలైన తర్వాత ఆయన ఫోన్ చేశారు. అప్పుడన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. ఆయన జీవితంలో ఆయన ఓ భాగం అయ్యారు. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో..!
జూనియర్ ఎన్టీఆర్
సంగీత ప్రపంచంలో పాటల రారాజు ఎస్పీ బాలసుబ్రమణ్యం అస్తమించడం కలచివేసింది. తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.
చిత్ర
ఓ శకం ముగిసింది. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రపంచం కూడా ఎప్పుడూ ఇలానే ఉండదు. నేను ఉత్తమ గాయనిగా మారేందుకు ఆయన చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీరు లేకుండా సంగీత విభావరిలో పాల్గొనడాన్ని ఊహించలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్, పల్లవితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.
వెంకటేశ్
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్‌లో హిట్లుగా నిలిచిన ‘ప్రేమ’, ‘పవిత్రబంధం’ వంటి సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మీ ఖ్యాతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా..
బోనీ కపూర్
ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. దాదాపు 16 భాషల్లో వేల గీతాలు ఆలపించారు. ఆయన స్వరం.. తరం, ప్రాంతం అనే తేడా లేకుండా సంగీత ప్రియుల్ని ఒక్కటి చేసింది. మీరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ.. మా జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఎప్పటికీ జీవంతోనే ఉంచుతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.
ఎస్.ఎస్. రాజమౌళి
బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలా మంది తమిళ, కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషల్లో పాడారు. అందరి చేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
మహేశ్‌బాబు
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇకలేరనే చేదు వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన అమృత స్వరానికి మరొకటి సాటి రాదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. మీ స్వరం జీవంతోనే ఉంటుంది. ఇటువంటి కష్ట సమయాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.
రవితేజ
ప్రతి భారతీయుడి గుండెలో కొలువైన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన స్వరం సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనిషిలోని అన్నీ భావోద్వేగాలకు తగ్గట్టు పాటలు పాడిన ఆయన ఓ లెజెండ్. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం.
నాని
నా హృదయం లక్షలాది పాటలుగా మారి ముక్కలైంది. నేను బాలు గారితో కలిసి షూట్‌లో ఉన్నప్పుడు బాబు జున్నును తీసుకుని సెట్‌కు రమ్మని నా భార్య అంజుకు చెప్పా. లెజెండ్ బాలుతో దిగిన ఫొటో జున్ను జ్ఞాపకాల్లో ఉండాలి అనుకున్నా.

