Homeఫ్లాష్ ఫ్లాష్#SputnikV #Covaxin #Covishield : వ్యాక్సీన్లను ఎలా తయారుచేశారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

#SputnikV #Covaxin #Covishield : వ్యాక్సీన్లను ఎలా తయారుచేశారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో రష్యా వ్యాక్సీన్‌కు అనుమతి లభించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా సురక్షితమైనదని, ఇది భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లాగే పనిచేస్తుందని భావిస్తున్నారు.

స్పుత్నిక్ వి వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి దాదాపు 92 శాతం రక్షణ కల్పించగలదని ‘ది లాన్సెట్‌’లో ప్రచురించిన చివరి దశ ట్రయల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

జులై చివరి నాటికి దేశంలో 25 కోట్ల మందికి టీకాలు వేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ భారత్‌లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని, వేగం పెంచకపోతే లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

స్పుత్నిక్ వి గురించి మనకు ఎంత తెలుసు

మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సీన్‌‌ చివరి ట్రయల్స్ ఫలితాలు రాక ముందు కాస్త వివాదాస్పదమైంది.

కానీ ఈ వ్యాక్సీన్‌తో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు నిరూపితమయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది ఒక కోల్డ్ టైప్ వైరస్‌ను ఉపయోగిస్తుంది. అది శరీరానికి కరోనావైరస్ చిన్న భాగాన్ని అందించే ఒక కారియర్‌లా, ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తుంది.

అలా ఈ టీకా వైరస్ జెనెటిక్ కోడ్‌కు తగ్గట్టు శరీరాన్ని సురక్షితంగా ఎక్స్‌పోజ్ చేస్తుంది. ముప్పును గుర్తించి, అనారోగ్యానికి గురవకుండా దానితో ఎలా పోరాడాలో గుర్తిస్తుంది.

టీకా వేసుకున్నాక శరీరం యాంటీ బాడీస్‌ను, ముఖ్యంగా కరోనావైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.

అంటే, కరోనావైరస్ నిజంగానే వ్యాపించినపుడు, రోగనిరోధక శక్తి దానితో పోరాడేలా సిద్ధంగా ఉంటుంది.

స్పుత్నిక్ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య (సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రత) నిల్వ చేయవచ్చు.

రిపోర్టుల ప్రకారం ఈ టీకాను మార్కెటింగ్ చేస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) భారత్‌లోని ఆరు వ్యాక్సీన్ తయారీదారులతో కలిసి 75 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది.

కానీ దీని రెండో డోస్ భిన్నంగా ఉంటుంది

స్పుత్నిక్ టీకా రెండు డోసులు వేరువేరుగా ఉంటాయి.

ఈ టీకా మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి.

కానీ దీని వెర్షన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

రెండు డోసులూ కరోనావైరస్ స్పైక్‌ లక్ష్యంగా పనిచేస్తాయి. కానీ రెండు వేరు వేరు వెక్టర్స్(రోగ వాహకాలు) ఉపయోగిస్తాయి. న్యూట్రలైజ్ చేసిన వైరస్ శరీరంలోకి స్పైక్‌ను తీసుకెళ్తుంది.

ఒకే వెర్షన్‌ను రెండు సార్లు ఉపయోగించడానికి బదులు, రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండు వేరు వేరు ఫార్ములాలు ఉపయోగించాలనే ఈ ఆలోచన కరోనా వైరస్ నుంచి శరీరానికి దీర్ఘకాలిక రక్షణను అందించవచ్చు.

సమర్థమైనదని నిరూపితం కావడంతోపాటూ ట్రయల్ సమయంలో స్పుత్నిక్ వ్యాక్సీన్ వల్ల ఎలాంటి సీరియస్ రియాక్షన్లు కలగలేదని, ఇది సురక్షితమైనది తేలింది.

ఈ వ్యాక్సీన్ వల్ల కొన్ని సైడ్ ఎపెక్ట్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, అవి చాలా తక్కువ. చెయ్యి నొప్పి, అలసట, తేలికపాటి జ్వరం లాంటివి ఉండచ్చు.

ఈ వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు రావడం, చనిపోవడం జరగలేదు.

స్పుత్నిక్ వి టీకాను రష్యాతోపాటూ అర్జెంటీనా, పాలస్తీనా, వెనెజ్వెలా, హంగరీ, యూఏఈ, ఇరాన్ ఇంకా చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు.

భారత్‌లో స్పుత్నిక్ వి టీకా వేయడం కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది.

కోవాగ్జిన్ గురించి మనకు ఏం తెలుసు?

అచేతనం చేసిన కరోనావైరస్ సాయంతో కోవాగ్జిన్‌ను తయారుచేశారు. వైరస్‌ను అచేతనం చేయడంతో దీన్ని శరీరంలోకి ఎక్కించినా మనకు ఎలాంటి హానీ జరగదు.

24ఏళ్లుగా 16కుపైగా వ్యాక్సీన్లను తయారుచేసిన చరిత్ర గల భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. 123కుపైగా దేశాలకు సంస్థ వ్యాక్సీన్లను ఎగుమతి చేస్తోంది. భారత్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి సేకరించిన అచేతనమైన వైరస్ సాయంతో సంస్థ తాజా వ్యాక్సీన్‌ను తయారుచేసింది.

ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్నవెంటనే, దీనిలోని వైరస్‌ను రోగ నిరోధక కణాలు గుర్తుపడతాయి. దీంతో వైరస్‌తో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.

నాలుగు వారాల తేడాలో రెండు డోసులను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను 2 రెండు నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది 81 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక పరీక్షల్లో తేలింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకముందే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు, ఈ వ్యాక్సీన్‌కు భారత్‌ ఆమోదముద్ర వేసింది. దీనిపై చాలా మంది సందేహాలు వ్యక్తంచేశారు.

తమ దగ్గర 2 కోట్ల డోసుల వ్యాక్సీన్లు సిద్ధంగా ఉన్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని రెండు పరిశ్రమల్లో మొత్తంగా 70 కోట్ల వ్యాక్సీన్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

కోవాగ్జిన్‌పై వివాదం ఏమిటి?

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి కోవాగ్జిన్‌కు అనుమతులు జారీ చేసినట్లు భారత ఔషధ ప్రాధికార సంస్థ జనవరిలో ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది.

పరీక్షలు పూర్తికాకముందే ఎలా అనుమతులు జారీచేస్తారని, లక్షల మందికి ఆ వ్యాక్సీన్లు ఎలా వేస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. దీని వెనుక లాజిక్ ఏమిటో తమకు అసలు అర్థం కావడంలేదని ద ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్ సామర్థ్యంపై సరైన సమాచారం లేకుండా అనుమతులు జారీచేయడంపై ఆందోళన వ్యక్తంచేసింది.

అటు ఔషధ ప్రాధికార సంస్థ, ఇటు భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను సమర్థించాయి. ”ఇది సురక్షితమైన వ్యాక్సీన్. శక్తిమంతమై రోగ నిరోధక స్పందనలను ఇది కలుగజేస్తోంది”అని చెప్పుకొచ్చాయి.

కోవిషీల్డ్ మాటేమిటి?

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను భారత్‌లో ద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ. నెలకు ఆరు కోట్లకుపైగా వ్యాక్సీన్లను తాము తయారుచేస్తామని సంస్థ వివరిస్తోంది.

చింపాంజీల నుంచి సేకరించిన సాధారణ జలుబు వైరస్ (అడెనోవైరస్)ను బలహీన పరచడం ద్వారా ఈ వ్యాక్సీన్‌ను తయారుచేశారు. ఈ జలుబు వైరస్‌ను కరోనావైరస్ మాదిరిగా పనిచేసేలా మార్పులు చేశారు. అయితే, దీనితో ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకదు.

ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్న వెంటనే, దీనిలోని డమ్మీ వైరస్‌ను కరోనావైరస్‌గా శరీరం భావిస్తుంది. వెంటనే ఇన్ఫెక్షన్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.

12 వారాల తేడాతో ఈ వ్యాక్సీన్ రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నిల్వ చేయాల్సి ఉంటుంది.

చాలా దేశాలు ఇప్పటికే ప్రజలకు ఇస్తున్న ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో వేసవిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సంగతి తెలిసిందే.

కోవిషీల్డ్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తుంది?

మొదట సగం డోసు, తర్వాత ఫుల్ డోసు తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

ఈ సగం-ఫుల్ డోసుల ఐడియాను సమర్థించేందుకు తగిన డేటా అందుబాటులో లేదు.

అయితే, రెండు డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే, టీకా సామర్థ్యం పెరుగుతందని ఓ అధ్యయనంలో తేలింది. 70 శాతం సామర్థ్యంతో ఇది పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

”బ్రెజిల్, బ్రిటన్‌లలో నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్ మంచి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది”అని భారత్‌లో ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్ శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలను కలగచేయగలదా? దీని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వస్తాయా? లాంటి అంశాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తెలుస్తాయి.

అయితే, భారతీయులపై ”బ్రిడ్జింగ్ స్టడీ” చేపట్టకుండానే ఆగమేఘాలపై ఈ వ్యాక్సీన్‌కు ఆమోదం తెలిపారని హక్కుల సంస్థ ఆల్ ఇండి డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది.

ఇతర వ్యాక్సీన్లు ఇవీ…

భారత్‌లో పరీక్షల దశలోనున్న ఇతర వ్యాక్సీన్ల వివరాలు ఇవీ

1 జైకోవ్-డీ వ్యాక్సీన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన జైడస్-క్యాడిలా అభివృద్ధి చేస్తోంది.

2 హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ అమెరికాకు చెందిన డైనావ్యాక్స్, బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తోంది.

3 జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్‌ను బయోలాజికల్-ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది.

4 భారత్‌లో తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్‌ హెచ్‌జీసీవో19ను సియాటెల్‌కు చెందిన హెచ్‌డీటీ సంస్థతో కలిసి పుణెకు చెందిన జెనోవా సంస్థ అభివృద్ధి చేసింది. వ్యాధి నిరోధక స్పందనలను ప్రేరేపించేందుకు దీనిలో జన్యు కోడ్‌ను ఉపయోగించారు.

5 ముక్కు ద్వారా వేసే ఓ వ్యాక్సీన్‌ను కూడా భారత్ బయోటెక్ సిద్ధం చేస్తోంది.

6 అమెరికా సంస్థ నోవావ్యాక్స్‌తో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది.

ఏఏ దేశాలకు భారత్ వ్యాక్సీన్లు అందిస్తోంది?

లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులు, ఆసియా, ఆఫ్రికాల్లోని 86 దేశాల కోసం 6.4 కోట్ల డోసులను భారత్ అందించింది. మరోవైపు అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాలకూ భారత్ వ్యాక్సీన్లను సరఫరా చేసింది.

కొన్ని కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సీన్‌లను గిఫ్ట్‌ల రూపంలో భారత్ అందిస్తోంది. మరికొన్నింటిని వాణిజ్య ఒప్పందాల రూపంలో వ్యాక్సీన్ తయారీ సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి. ఇంకొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమం కోవాక్స్ కింద సరఫరా చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి 190 దేశాలకు రెండు బిలియన్ డోసులను కోవాక్స్ కింద సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది.

మార్చిలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఎగుమతులపై భారత్ తాత్కాలికంగా నిలుపుదల విధించింది. భారత్‌లో కేసుల పెరుగుతుండటంతో డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ అందుబాటు పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img